- సామాజిక వర్గాల వారీగా అవకాశం
- నేడు చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం
- చైర్మన్‌గా నిరంజన్, సభ్యులుగా సురేందర్, బాలలక్ష్మి, రాపాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి. నిరంజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్‌గా నియమించ గా, సభ్యులుగా మరో కాంగ్రెస్ నేత రాపో లు జయప్రకాశ్, సీనియర్ జర్నలిస్టు తిరుమలగిరి సురేందర్, ఓయూ జేఏసీ నాయకు రాలు బాలలక్ష్మికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. బీసీ కమిషన్ నియామకంలో ప్రభుత్వం వివిధ వర్గాలకు చోటు కల్పిస్తూ సామాజిక న్యాయం కూడా పాటించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీలోని బీసీ నేతలతో పాటు బీసీ సంఘా ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్‌కు కులగణన అనేది పెద్ద టాస్క్‌గానే తీసుకోవాల్సి ఉం టుందని బీసీ వర్గాల నేతలు గుర్తు చేస్తున్నారు.
ఓయూ జేఏసీ నేత నుంచి బీసీ కమిషన్ మెంబర్‌గా బాలలక్ష్మి..
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి జేఏసీలో కీలకంగా పనిచేసిన బాలలక్ష్మి(బీసీ గౌడ)ని తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. జనగామ జిల్లా నర్మెటకు చెందిన బాలలక్ష్మి ఓయూ నుంచి ఎంఏ ఎకనామిక్స్, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ పట్టా పొందారు. విద్యార్థి ఉద్యమాల్లో పురుషులతో సమానంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేశారు.
ఛలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సాగరహారం, మహాగర్జన తదితర కార్యక్రమాల్లో పాల్గొని పోలీసుల చేతిలో లాఠీచార్జ్, రబ్బర్ బుల్లెట్లకు కూడా బాలలక్ష్మిగురయ్యారు. 2014 లో కాంగ్రెస్‌లో చేరి పార్టీ అభ్యర్థుల విజ యం కోసం ప్రచారం నిర్వహించారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర, 2023 అసెం బ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి, పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పని చేశారు.
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా రాపోలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గానికి చెందిన రాపోలు జయప్రకాశ్ (పద్మశాలి)ను కూడా ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉండటమే కాకుం డా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేశారు. గల్లీ నుంచి ఢల్లీ వరకు పార్టీలో పలువురు సీనియర్లకు రాపోలు సుపరిచితం గా ఉన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీ కమిషన్ సభ్యుడిగా అవకాశ కల్పించింది.
పాత్రికేయుడి నుంచి సభ్యుడి వరకు సురేందర్..
సీనియర్ పాత్రికేయులు, బీసీ సామాజిక వర్గానికి తిరుమలగిరి సురేందర్ (మున్నూరుకాపు)ను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. 1958 జూన్ 16న జన్మించిన సురేందర్.. ప్రస్తుతం తెలంగాణ వార్త దినపత్రిక సం పాదకులుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి 2014 వరకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో కొనసా గారు. ఆంధ్రభూమి, ఈనాడు దినపత్రికల లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా, పీసీసీ మీడియా అడ్వయిజర్‌గా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా 40 ఏళ్లుగా సురేందర్ పనిచేస్తూనే అనేక పుస్తకాలు రాశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, సోనియాగాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నాయకులకు సంబంధించిన పుస్తకాలను రాశారు.