10-03-2025 01:13:25 AM
దుబాయ్, మార్చి 9: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో బ్రాస్వెల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా.. షమీ, జడేజా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి గెలుపొందింది.
భారత బ్యాటింగ్లో రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్ (48) విలువైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఉత్కంఠత చెలరేగినప్పటికీ కేఎల్ రాహుల్ (34 నాటౌట్), జడేజా (౯ నాటౌట్) జట్టును గెలిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, బ్రాస్వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ అందుకున్న భారత్ అదే సమయంలో 25 ఏళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి కూడా కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. గతంలో 2002లో లంకతో సంయుక్త విజేతగా నిలిచిన భారత్.. 2013లో ధోనీ నేతృత్వంలో రెండోసారి టైటిల్ అందుకుంది. తాజాగా రోహిత్ సారథ్యంలోని టీమిండియా హ్యాట్రిక్ టైటిల్ సాధించడం విశేషం.
టీమ్ ఇండియాకు అభినందనలు
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఐసీసీ చాంపి యన్‌షిప్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు సహా మం త్రులు, పలువురు నేతలు భారత జట్టు కు శుభాకాంక్షలు తెలిపారు.