మట్టికోటపై ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ మరోసారి పాగా వేసింది. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరంభం నుంచి ఒక్కో మ్యాచ్‌లో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకుంటూ వచ్చిన స్వియాటెక్ తుది పోరులోనే అదే జోరును ప్రదర్శించింది. అనుభవం ముందు ఎంతవారైనా తలవంచాల్సిందే అన్న తరహాలో కొదమ సింహంలా గర్జించిన స్వియాటెక్ మట్టికోట మహారాణిగా నిలిచింది. ఇప్పటికే మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన స్వియాటెక్ తాజాగా నాలుగోసారి టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. టోర్నీ ఆద్యంతం చిరుతలా దూకుడు ప్రదర్శించిన ఇటలీ చిన్నది జాస్మిన్ పవోలినీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నేడు జరగనున్న పురుషులు సింగిల్స్ ఫైనల్లో అల్కారాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నారు.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ అవతరించింది. శనివారం సెంటర్ కోర్టు వేదికగా మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ (పొలాండ్) 6 6 జాస్మిన్ పవోలినీ (ఇటలీ)పై ఘన విజయాన్ని అందుకుంది. గంటకు పైగా సాగిన పోరులో స్వియాటెక్ అనుభవం ముందు జాస్మిన్ నిలవలేకపోయింది. కేవలం రెండు సెట్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్‌లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ 5 బ్రేక్ పాయింట్లతో పాటు 18 విన్నర్లు కొట్టింది. ఇక జాస్మిన్ మ్యాచ్‌లో 18 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 2022, 2023లో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న స్వియాటెక్ తాజా విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది.
ఓవరాల్‌గా స్వియాటెక్ కెరీర్‌లో ఇది నాలుగో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఈసారి టోర్నీలో స్వియాటెక్ కేవలం ఒక్కసారి మాత్రమే తన ప్రత్యర్థికి సెట్‌ను కోల్పోయింది. దీన్ని బట్టే స్వియాటెక్ జోరు ఎంతలా కొనసాగిందన్నది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జాస్మిన్ పవోలినీ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడింది. అంచనాలకు మించి ప్రదర్శన కనబరిచినప్పటికీ తుది పోరులో మాత్రం స్వియాటెక్ అనుభవం ముందు నిలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నేడు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ వీరుడు కార్లోస్ అల్కారాజ్‌తో రష్యా స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 2 6 6 6 7వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టాడు.