గాంధీనగర్: భారత యంగ్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో క్రస్టెవా బెలోస్లవా (బల్గేరియా)పై దివ్య విజయం సాధించింది. మొత్తం 11 రౌండ్లు నిర్వహించిన ఈ టోర్నీలో 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. ఇందులో 9 విజయాలు, రెండు ‘డ్రా’లు ఉన్నాయి. తుదిపోరులో తెల్లపావులతో బరిలోకి దిగిన దివ్య ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ నుంచి అండర్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నాలుగో మహిళా ప్లేయర్‌గా దివ్య రికార్డుల్లోకెక్కింది. గతంలో కోనేరు హంపి (2001), ద్రోణవల్లి హారిక (2008), సౌమ్య స్వామినాథన్ (2009) ఈ ఘనత సాధించారు. బాలుర విభాగంలో భారత ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.