calender_icon.png 28 December, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంప్ క్రెజికోవా

14-07-2024 01:01:49 AM

గ్రాస్ కోర్టు మహారాణిగా బార్బోరా క్రెజికోవా నిలిచింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన క్రెజికోవా కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకుంది. మరోవైపు నెల రోజుల కిందట ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచిన జాస్మిన్ పవోలిని మరోసారి ఓటమివైపే నిలిచింది. అనుభవం ముందు నిలవలేకపోయిన ఇటలీ చిన్నది సంచలన ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) అవతరించింది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో 31వ సీడ్ క్రెజికోవా 6 2 6 ఏడో సీడ్ జాస్మిన్ పవోలిని (ఇటలీ)పై విజయాన్ని నమోదు చేసుకుంది. 28 ఏళ్ల క్రెజికోవా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2021లో క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన సంగతి తెలిసిందే. దాదాపు 2 గంటల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను క్రెజికోవా తొందరగానే సొంతం చేసుకుంది.

అయితే రెండో సెట్‌లో ఫుంజుకున్న పవోలిని విజయం సాధించి రేసులోకి వచ్చినట్లే అనిపించింది. కానీ మూడో సెట్‌లో తన అనుభవాన్ని రంగరించిన క్రెజికోవా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో 6 ఏస్‌లు కొట్టిన క్రెజికోవా 28 విన్నర్లు సంధించి స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మూడు ఏస్‌లకు మాత్రమే పరిమితమైన పవోలిని 19 విన్నర్లు మాత్రమే కొట్టగలిగింది. వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో గత 8 ఏళ్లుగా 8 మంది విజేతలుగా నిలుస్తూ రావడం విశేషం. నెల రోజుల కిందట ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో రన్నరప్‌గా నిలిచిన జాస్మిన్ పవోలిని తాజా వింబుల్డన్‌లోనూ ఫైనలిస్టుగా నిలిచింది.

సెరెనా విలియమ్స్ (2016) తర్వాత వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఫైనలిస్టుగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా పవోలిని నిలిచింది. నేడు జరగనున్న పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్‌తో రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) అమీతుమీ తేల్చుకోనున్నాడు. గతేడాది వింబుల్డన్ ఫైనల్ పోటీ కూడా ఈ ఇద్దరి మధ్యే జరగ్గా.. అల్కరాజ్ విజేతగా నిలిచాడు.