27-04-2025 04:54:55 PM
వనమా వెంకటేశ్వరరావు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Former Minister Vanama Venkateswara Rao) అన్నారు. చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన ఆధ్వర్యంలో వేలాదిమంది గులాబీ శ్రేణులతో పెద్ద ఎత్తున ప్రదర్శనగా బయలుదేరారు. ఉదయం నుండే వనమా నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు పట్టణాలలోని గులాబీ శ్రేణులు ఇల్లందు క్రాస్ రోడ్ కు చేరుకున్నారు. వనమా సతీమణి వనమా పద్మావతి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో కలిసి తన భర్తైన వనమాకు హారతులు పట్టి ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.
డప్పు వాయిద్యాలతో వందలాదిమంది కళాకారులతో ర్యాలీగా బయలుదేరింది. ఇల్లందు క్రాస్రోడ్ వద్ద వనమా గులాబీ జెండా ఆవిష్కరించారు. గులాబీ జెండాలతో తోరణాలతో ఆ ప్రాంతం సుందరంగా తీర్చిదిద్దారు. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు బీఆర్ఎస్ పార్టీ బుల్లెట్లు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ డీజే కు కేసిఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఉత్సాహమైన పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవకు జన సమీకరణ విజయవంతం అవడంలో కొత్తగూడెంలో వనమా రాఘవ క్రియాశీలక పాత్ర పోషించారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం, కార్యకర్తల్లో జోష్ కనపడింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలు నడుంబిగించారు. వనమా వయసు మీద పడినా నవ యువకుడిగా గత నెల రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తల్లో నాయకుల్లో సన్నాక సమావేశాలు నిర్వహిస్తూ సభ విజయవంత కోసం కృషి చేశారు.