22-03-2025 06:40:28 PM
సీఐటీయూ ఆధ్వర్యంలో గోడ ప్రతుల ఆవిష్కరణ
ఇల్లెందు,(విజయక్రాంతి): దేశంలో ఆర్టీసీని రక్షించుకోవడం కోసం, రవాణా రంగాన్ని కాపాడుకోవడం కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మార్చి 24న తలపెట్టిన చలో పార్లమెంటుకు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఆర్టీసీ, రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని చలో పార్లమెంటును జయప్రదం చేయాలని టీజీఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోడ ప్రతులను శనివారం ఇల్లందు ఆర్టీసీ డిపో ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ... రవాణా రంగంలో రిక్షా మొదలుకొని ఆటో టాక్సీ లారీ ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ వగైరాలన్నీ తీవ్ర సంక్షోభంలో నెట్టబడ్డాయని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ దుస్థితి కి కారణమన్నారు.
కార్మికుల పని పరిస్థితులు దుర్భరంగా మారాయని ఈ పరిస్థితులు మారాలంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అందుకే చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. 2019 తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న పర్మిట్ వ్యవస్థను మార్చేసిందని, వంద శాతం ప్రైవేటీకరణకు తెర లేపిందన్నారు. దేశం జీడీపీలో 4.5శాతం వాటా కలిగిన రవాణా రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ రంగంలో పనిచేస్తున్న 10 కోట్ల మంది కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం సీఐటీయూ నిరంతరాయంగా కృషి చేస్తోందన్నారు. ఐనా పాలకులలో ఎటువంటి చలనం లేకపోగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకొని పోతామని 2025-26 బడ్జెట్ ద్వారా కూడ తెలియ జేశారన్నారు.
ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. ఆర్టీసీ బలోపేతం చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల సేకరణ నిర్వహణ ఆపరేషన్ లను ఆర్టీసీలకే అప్పగించాలి. సబ్సిడీ మరియు వయబిలిటీ గ్యాప్ ఫండు ను ఆర్టీసీలకు చెల్లించాలి. ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఆర్టీసీలకు క్యాపిటల్ కంట్రిబ్యూషన్ పునరుద్ధరించాలి. అన్ని ఆర్టీసీల అప్పులు ప్రభుత్వ ఈక్విటీగా మార్చాలి. నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలి. డీజిల్ ధరలు భీమా ప్రీమియం మరియు టోల్ ఛార్జీలను తగ్గించాలి. వాహన తనిఖీ రవాణా శాఖ ఆధ్వర్యంలో జరగాలి. రవాణా రంగం మరియు చిన్న యజమానులను రక్షించడానికి మోటారు వాహనాల సవరణ చట్టం 2019 ని తగిన విధంగా సవరించాలి.
స్వయం ఉపాధి తో సహా అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రత చట్టం చేయాలి. మోటారు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ యొక్క నిబంధనలు పనిగంటలు వారపు విశ్రాంతి రోజు మొదలైన వాటిని కచ్చితంగా అమలు చేయాలి. బీఎన్ఎస్-2023లోని సెక్షన్ 106(1),(2)ని ఉపసంహరించుకోవాలి. ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని జాతీయ రహదారులపై వాహనాల వేగానికి అనుగుణంగా అమలు చేయాలని లోప భూయిస్టంగా ప్రమాదకరంగా రోడ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లోసీఐటీయూ మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ,డిపో ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు అంజయ్య, బీ కే రావు, పీ ఎల్ రావు, నజీర్, బీ ఆర్ బాబు, సీతా రాములు,నాగలక్ష్మి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.