ఐ.వి.మురళీకృష్ణ శర్మ :
జమ్మూ కశ్మీర్ అంటేనే ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలతోపాటు ఉగ్రవాదులు, రక్తసిక్తం, అశాంతి వంటివి గుర్తుకొస్తాయి. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత త్వరలో మూడు విడతలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ మొదటి నుండి ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యమైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభావమూ కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల హవా రాష్ట్రంలో ఏ మేరకు ఉండనుందనే అంశంపై ‘పీపుల్స్ పల్స్’ చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్టికల్ 370తోపాటు జమ్మూ కశ్మీర్ రాష్ట్రహోదాను కూడా రద్దు చేసిన తర్వాత 2019లో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించకుండా నరేంద్ర మోదీ సర్కార్ కాలయాపన చేసింది. సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో షెడ్యూల్ విడుదల అయ్యింది. 2014 తర్వాత పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారనే అంశం కంటే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదాలో కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా ఎన్నికలు జరుగుతుండడంతో అక్కడి ప్రజాతీర్పుపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తున్నది.
రాష్ట్రంలో 2002 నుండి సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభం కావడంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఆవశ్యకత ఏర్పడింది. అక్కడ మొదటినుండి ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిపత్యమే కొనసాగినా, రెండుసార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కూడా బలమైన పార్టీగా ఉంది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో పీడీపీ, -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2008, 2014 ఎన్నికల్లోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2002లో పీడీపీకి మద్దతిచ్చిన కాంగ్రెస్ 2008లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో జత కలిసింది. 2014లో దేశ వ్యాప్తంగా బలపడిన బీజేపీ జమ్మూ కశ్మీర్‌లోనూ 25 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో రాష్ట్రంలో మరో జాతీయ పార్టీకి కూడా అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో 3 నెలల తర్వాత బీజేపీ పీడీపీకి మద్దతివ్వడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2002 నుండి ప్రాంతీయ పార్టీలు బలహీన పడడంతో రాష్ట్రంలో జాతీయ పార్టీల మద్దతు కీలకంగా మారింది.
నియోజక వర్గాల పునర్విభజన
కశ్మీర్ లోయలో ముస్లింలు అధికంగా ఉండడంతో రాష్ట్రంలో పట్టు సాధించడానికి మోదీ సర్కారు నియోజక వర్గాల పునర్విభజనను ఆయుధంగా మార్చుకుం ది. గతంలో రాష్ట్రంలో 87 స్థానాలుండగా పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 90కి పెరిగింది. లోగ డ జమ్మూలో 37 స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 43కు చేరుకుంది. కశ్మీర్‌లో46 స్థానాలుండగా 47 సీట్లు అయ్యాయి. కశ్మీర్ లోయ లో ప్రాంతీ య పార్టీలైన ఎన్‌సీ, పీడీపీ మధ్య, జమ్మూలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో 1967, 1972 ఎన్నికల్లో వరుసగా మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. 2002లో ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో, సంకీర్ణ ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ రెండో విడతలో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2002లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2008లో 17 శాతం ఓట్లతో 17 స్థానాలు పొందింది. 2014లో 18 శాతం ఓట్లు పొందినా ఐదు సీట్లు కోల్పోయి 12 స్థానాలకు పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే 2004, 2009 ఎంపీ ఎన్నికలలో 2 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటుకూడా సాధించలేదు. 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఎన్‌సీ, పీడీపీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 19 శాతంకు పైగా ఓట్లు సాధించినా రిక్త హస్తమే ఎదురయ్యింది.
ఎన్‌సీతో కాంగ్రెస్ పొత్తు
దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో యాత్రను ముగించడంతో పార్టీ రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా లోక్‌సభ ఎన్నికల్లో సత్ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్టు రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. పోటీ చేసే సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను గరిష్టంగా జమ్మూ ప్రాంతానికే పరిమితం చేయాలని ఎన్‌సీ చూస్తున్నా కశ్మీర్ లోయలోనూ గౌరవ ప్రదమైన సంఖ్యలో సీట్లు కావాలని కాంగ్రెస్ ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రానికి ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామని ఎన్‌సీ చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీజేపీ చూస్తున్నది. క్షేత్రస్థాయిలో ప్రజలు జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని గట్టిగా కోరుతుండడంతో ఇది కాంగ్రెస్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి.
పెరిగిన బీజేపీ ప్రాభవం
మోదీ శకానికి ముందు రాష్ట్రంలో బీజేపీ ప్రభావం నామమాత్రమే. 1972లో జనసంఘ్ 3 స్థానాలు గెలిచిన అనంతరం బీజేపీ 1987లో 2, 1996లో 8 స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. 2002లో ఒక్క సీటుకూడా గెలవని బీజేపీ 2008లో 12 శాతం ఓట్లతో 11 స్థానాలు గెలిచింది. 2014 ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో 25 స్థానాల్లో గెలవడంతో బీజేపీ రాష్ట్రంలో కీలక పార్టీగా ఆవిర్భవించింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ జమ్మూ ప్రాంతంలో బలపడింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014, 2019లో మూడు స్థానాలు గెలిచిన బీజేపీ, 2019 తర్వాత లద్దాఖ్ వేరు కావడంతో 2024లో జమ్మూ లో మిగిలిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి తన పట్టును నిలుపుకుంది. ఆర్టికల్ 370 రద్దు, నియోజక వర్గాల పునర్విభజనతో జమ్మూలో సీట్లు పెరగడం తమకు సానుకూలమనే భావనలో బీజేపీ ఉంది. జమ్మూ లో ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించేలా బీజే పీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కశ్మీర్ లోయలో ఏ మాత్రం బలం లేని బీజేపీ రాష్ట్రంలో చక్రం తిప్పడం అంత సులభం కాదు.
కశ్మీర్ ప్రాంతంలో ఉనికే లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న మూడు స్థానాల్లో బరిలో లేకుండా ఇండిపెండెంట్లకు మద్దతిచ్చింది. మరోవైపు జమ్మూలో పరిస్థితి బీజేపీ ఆశిస్తున్నంత అనుకూలంగా లేదు. ఉగ్రవాద దాడులు జమ్మూ లో పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. కశ్మీర్ లోయలో ‘పండిట్ల్లు’ లక్ష్యంగా ఉగ్రదాడులు జరగడంతో బీజేపీపై పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయనే భావనతో వారున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన లాభం కన్నా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించకుండా కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగించడంపై కశ్మీర్‌తోపాటు జమ్మూ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో కనిపించింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌సీ చెరో రెండు స్థానాల్లో, ఇండిపెండెంట్ మరో స్థానంలో గెలిచారు. ఈ ఫలితాల ఆధారంగా అసెంబ్లీ సీట్లపై అధ్యయనం చేస్తే బీజేపీకి 29 స్థానాల్లో, కాంగ్రెస్‌కు 7 స్థానాల్లో, ఎన్సీకి 34 స్థానాల్లో, పీడీపీకి 5 స్థానాల్లో, ఇండిపెండెంట్ ఎంపీగా గెలిచిన ఇంజినీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తేహాద్ పార్టీకి 14 స్థానాల్లో, పీపుల్స్ కాన్ఫ రెన్స్‌కు ఒక స్థానంలో ఆధిక్యత కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఈ అంచనాలు మారవచ్చు. జాతీ య పార్టీలకు సవాలుగా మారిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. మరోవైపు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమికి పరిస్థితులనుబట్టి పీడీపీ కూడా మద్దతివ్వవచ్చు. ఏదేమైనా అక్టోబర్ 4న వెలువడే ప్రజల తీర్పు చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది.
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ