బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఖమ్మం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో సత్తుపల్లి, వేంసూరులో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. శనివారం సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
దీంతో ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేందుకు బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇతర నాయకులు బయలుదేరుతుండగా ముందస్తుగా పోలీసులు వారిని ఇళ్ల వద్దనే అరెస్ట్ చేసి, వేంసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసి, సత్తుపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు సవాల్ చేస్తేనే వచ్చామని, బీఆర్‌ఎస్ లీడర్ల అరెస్ట్ సరికాదన్నారు.