‘‘అదలని తేరు, తేరికిని నాదరువై తగువిల్లు, వింటికిం గుదురగు నారి, నారిపయి గూన్కుశరంబు, శరంబు బొడ్డునం బొదలిన యంత, యంత ముఖముల్ నిజవాసములైన గుఱ్ణముల్ చెదరక నీకు నెట్టిపని సేయునయా! గిరిజాధినాయకా!”
అంటూ చక్రపాణి రంగనాథ కవి రచించిన ఈ పద్యం క్రీ.శ. 1500 ప్రాంతంలో జీవించిన పెదపాటి జగన్నాథ కవి సంకలనం చేసిన ‘ప్రబంధ రత్నాకరం’లో ఉంది. దీంతోపాటు చక్రపాణి రంగనాథునివే మరో రెండు పద్యాలను కూడా సంజీవకవి పేర్కొన్నాడు. దీనినిబట్టే ప్రముఖ సాహితీ పరిశోధకుడైన ఆరుద్ర “క్రీ.శ.1500 వరకు చక్రపాణి రంగనాథుని రచనలు విరివిగానే లభిస్తూ ఉండి ఉండవచ్చునని” పేర్కొన్నారు.
పాల్కురికి సోమనాథుని సమకాలికుడు!
చక్రపాణి రంగనాథుడిని మహాకవి పాల్కురికి సోమనాథుని సమకాలికునిగా అనేకమంది సాహిత్యకారులు భావించారు. అంటే, ఈ కవిని 13వ శతాబ్దపు కవిగా గుర్తించవచ్చు. ఈయనను గురించి ఏకామ్రనాథుడు తన ‘ప్రతాప చరిత్రము’లోనూ వివరించాడు. అదే విధంగా, కన్నడ కవులైన తొంటదార్యుడు తన ‘సోమనాథ పురాణం’లోను, సిద్ధనంజేశ కవి రచించిన ‘గురురాజ చరిత్ర’లోను ఈయన విషయం ప్రస్తావితమైంది.
అయితే, “గోన బుద్ధారెడ్డి కృతి అయిన ‘రంగనాథ రామాయణము’ను ఈ చక్రపాణి రంగనాథుడే రచించి బుద్ధారెడ్డి పేరు పెట్టాడని” కొందరు సాహితీవేత్తలు భావించారు. కానీ, ఈ విషయాన్ని సాహిత్య చరిత్రకారులు అనేక ప్రమాణాలతో ఖండిస్తూ, ఆ రచనను గోన బుద్ధారెడ్డి కృతిగానే నిర్ధారించారు.
చక్రపాణి రంగనాథునికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన ‘పాల్కురికి సోమనాథునితో వాదించి ఓడిపోయి శివదీక్ష పొంది శైవుడుగా మారినట్లు’ ఆ కథలద్వారా తెలుస్తున్నది.
కొన్ని తెలుగు పుస్తకాలవల్ల మాత్రమేగాక కొన్ని కన్నడ కావ్యాలవల్ల కూడా ఇలాంటి కథలు తెలుస్తున్నట్లు సాహిత్య చరిత్రకారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా కన్నడ భాషలోని తొంటదార్యుని రచన అయిన ‘సోమనాథ పురాణం’ అనే కావ్యం వల్ల తెలుస్తున్నదనీ ఆరుద్ర తన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో పేర్కొన్నారు.
“చక్రపాణి రంగనాథుడనే వైష్ణవునితో సోమనాథునికి మత విషయంలో వివాదం ఏర్పడింది. శైవుడు కాని వానిని కంటితో చూడగూడదనే నియమం ఉన్నందున సోమనాథుడు తెరచాటు నుంచి రంగనాథునితో వాదించడానికి అంగీకరించాడు. కాని, సోమనాథుని కుమారుడు చతుర్ముఖ బసవేశ్వరుడే తండ్రికి మారుగా తలపడ్డాడు. ఇద్దరికీ గొప్ప సంవాదం జరిగింది.
రంగనాథుడు ఓడిపోయాడు. పరాజయ దుఃఖంతో అతడు ఇంటిముఖం పట్టాడు. త్రోవలో శ్రీశైలం ఉంది. రంగనాథుడు ఆ క్షేత్రంలో ఆగి మల్లికార్జున స్వామిని దర్శించుకోలేదట. అందువల్ల అతని రెండు కళ్లు పోయాయి.
రంగనాథుడు అహోబిలం చేరుకుని నరసింహస్వామిని ప్రార్థించాడు. స్వామివారు ఆ రాత్రి కలలో కనబడి ‘శివుని గొప్పతనాన్ని’ బోధించాడు. రంగనాథుడు సిగ్గు పడి, బుద్ధి తెచ్చుకుని శ్రీశైలం వెళ్లి మల్లికార్జునుణ్ణి పూజించాడు. అప్పుడొక కన్ను వచ్చిందట. ఆ తరువాత పాల్కురికి సోమనాథుని పాదాలమీద పడి క్షమాపణ చెప్పుకోగా, రెండవ కన్ను వచ్చిందట.”
అన్న ఈ కథనంలో ఎన్ని సత్యాలు ఉన్నాయో గాని శివ భక్తులు పాటించాలన్న గొప్ప సందేశం వినిపిస్తున్నది.
శివతత్త ప్రాధాన్యాన్ని తెలిపే గొప్ప రచనలు
చక్రపాణి రంగనాథుడు రచించిన అనేక రచనలు శివతత్త ప్రాధాన్యాన్ని బోధించే గొప్ప రచనలుగా నిలిచిపోయాయి. తన దృష్టి తిరిగి వచ్చిన తరువాత రంగనాథుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఒక రగడ చెప్పడం, అందులో ప్రతి పాదం చివరలో ‘కంటి’ అనే శబ్ద ప్రయోగం జరిగిన కారణంగా దానిని ‘నయన రగడ’గా సాహితీవేత్తలు గుర్తించారు.
అయితే, కీ.శే. చాగంటి శేషయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి దీనిని ‘నయనగతి రగడ’ అన్నారు. కాని, ఇది కేవలం ‘నయన రగడ’ మాత్రమేనని ఆరుద్ర భావించారు. అంతేగాక, తొమ్మిది విధాలైన ‘రగడ’ భేదాలలోని ద్విపదగతి, మధురగతి, హరిగతి, హరిణగతి, వృషభగతి అనేవి మాత్రమే గతి అనే పదంతో అంతమయ్యే రగడలని ఆరుద్ర తెలిపారు. “రంగనాథుడు రచించిన రగడ కేవలం నయన రగడ మాత్రమేనని” అని వివరించారు.
సుప్రసిద్ధ పరిశోధకులు కీ.శే.వేటూరి ప్రభాకరశాస్త్రి.. ‘తొంటదార్యుడు చెప్పిన కథను, ఈయన రచించిన నయన రగడ’ను సేకరించి తమ ‘చాటుపద్య మణిమంజరి’లోని రెండోభాగంలో ప్రచురించారు. ఈ ‘నయన రగడ’ 324 పాదాల రచన. ఈ రగడ వల్లనే చక్రపాణి రంగనాథునికి ఒకసారి కన్నులు పోయి తిరిగి వచ్చినట్లు, తిరిగి వచ్చిన తరువాతే ఈ రచన చేసినట్లు తెలుస్తున్నది.
ఆ విషయం “నయముగా నయనములు నా కీయ బొడగంటి భయభక్తు లీభర్గు పాదములు పొడగంటి”
అన్న పద్య పాదాలనుబట్టి అవగతమవుతున్నది. అంతేగాక, తొంటదార్యుని రచనలోని విషయం కూడా సత్య కథనమేనని భావించే అవకాశం కూడా ఉంది. అయితే, కన్నడంలో తొంటదార్యుడేగాక సిద్ధనంజేశుని రచనలోను ఈ కథే కనిపిస్తుంది కనుక ఇటువంటి సందర్భమే జరిగిందని నిర్ణయించవచ్చు.
అటు తెలుగు ఇటు సంస్కృతం
చక్రపాణి రంగనాథుడు శివదీక్షాపరుడైన తర్వాత ‘శరభ లీల’, ‘వీరభద్ర విజయము’ అనే రెండు గ్రంథాలనే గాక ‘శ్రీగిరినాథ విక్రమము’ అనే గ్రంథాన్ని సీసపద్యాల్లో రచించాడు. ఈ తెలుగు రచననే సంస్కృతంలోనూ రచించినట్లు కొందరు సాహిత్యకారులు పేర్కొన్నారు. ఈ రచన 500 సీసపద్యాలతో కూడిందిగా కూడా వారు అంటున్నారు. కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రి.. చక్రపాణి రంగనాథుని ఇతర రచనల వివరాలను తెల్పుతూ, కన్నడ కవి సిద్ధనంజేశుని పద్యాలను ప్రమాణంగా చూపారు.
“శ్రీశైల భర్తకును సీసంగళెనూరు
లేనప్ప పద్యంగళెంటు సావిరగళుం
భానురద దండకం సహస్రాతారావళియు నాల్కు లయగ్రాహియు
ఆ శతక వృత్తగళు దోధకం సావిరవు
భానురద తోటకం నూరు రంగళెగళేడు
భాషిసద మత్తకోకిల మూఱు మూరు సావిరంగీతియం తాఱునూఱు
సరసమం జెర వెంటు కందంగళై నూ ఱు
విర చినిద కృతియు మూవత్తాఱు గద్యగళు
నిరువమూవత్తారు వుభయ శతకం వొప్పు మిగిలు సర్వేశనిమగె”
అంటూ చెప్పిన ఈ సిద్ధనంజేశుని పద్యాలనుబట్టి.. చక్రపాణి రంగనాథుడు సీసపద్యాలు, దండకము, లయగ్రాహి, తోదక వృత్తాలు, తోటక వృత్తాలు, మత్తకోకిలలు, గీతపద్యాలు, కందాలు, గద్యలు మొదలైన ఛందస్సుల్లో వేలాది పద్యాలతో కూడిన కృతులను రచించినట్లు తెలుస్తున్నది. దీనివల్ల రంగనాథుని ప్రతిభ ఎంతటిదో మనకు అవగతమవుతున్నది.
అంటే, ఈ కవి శ్రీశైల మల్లికార్జునుని గురించి 500 సీసపద్యాలు, 8,000 పద్యాలున్న మరో రచన, 1,000 పాదాలు కలిగిన ఒక దండకం, ఒక తారావళి, నాలుగు లయగ్రాహులు, ప్రత్యేకమైన ఒక వృత్త శతకం, వేయి తోదక వృత్తాలు, నూరు తోటక వృత్తాలు, ఏడు రగడలు, 3,000 మత్తకోకిలలు, 600 గీత పద్యాలు, ఎనిమిది మంజరులు, 500 కందాలు, 36 గద్యలు, 36 ఉభయ శతకాలు రచించినట్లు పై కన్నడ పద్యాలు తెలుపుతున్నాయి. దీన్నిబట్టి రంగనాథునికి ఛందస్సుపట్ల ఎంతటి అధికారముందో అర్థమవుతున్నది.
శంకరుని కోసం తన ఎత్తు రచనలు!
“చక్రపాణి రంగనాథుడు ఇన్ని రచనలు ఎందుకు చేశాడు?” అనడానికి కూడా ఆయన రచించిన ‘నయన రగడ’లోనే మనకు సమాధానం లభిస్తుంది.
“ఇంక శ్రీగిరిజేర నేగందు ననిగంటి
శంకరుని కృప వడయ సమయమిదియని గంటి
నికను నా యెత్తు కృతులిత్తునని పొడగంటి
నిక కృతుల్ జెప్ప నాకేమి భయమని గంటి
వడి కృతుల్ నా యెత్తు వచ్చునని పొడగంటి
మృడు డిక నా కృతుల్ మెచ్చునని పొడగంటి”
అంటూ చెప్పిన ఈ రగడ సాక్ష్యంగా కవి తాను శివపరమైన తన ఎత్తు కృతులు రచిస్తానని, ఆ మహాదేవుడు ఈ రచనలను మెచ్చుకుంటాడని శివుని పట్ల తనకుగల గాఢ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. ఇంత ఛందో వైవిద్యాన్ని ప్రదర్శించిన రంగనాథుని ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం.
చక్కని తెలుగు పదాలతో రక్తి కట్టించే రచనలు
చక్రపాణి రంగనాథుడు రచించిన ‘నయన రగడ’లో కొందరు నాటి వ్యక్తుల పేర్లుకూడా కనిపిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పంక్తులలో పాల్కురికి సోమన ప్రభావం కూడా కనిపిస్తుందని కొందరు విమర్శకులు పేర్కొన్నారు. తన రచనలో చక్కని తెలుగు పదాలను పొదిగి రచనలను రక్తి కట్టించిన మహాకవి రంగనాథుడు. అనేక దేశి పదాలను ప్రయోగించిన దానినిబట్టి దేశిపై ఆయనకుగల మమకారం ఎంతటిదో మనం తెలుసుకోవచ్చు.
ఇంతటి కవిత్వ ప్రతిభ, శబ్దాలపై పట్టు, ఛందస్సుపై అధికారం ఉన్న కవి కనుకనే అనంతామాత్యుడు, గోపరాజు వంటి పూర్వకవులు, లింగమగుంట తిమ్మన వంటి లక్షణ గ్రంథకర్తలు వీరి పద్యాన్ని ఉదాహరించి గౌరవించారు. అయితే, తన యెత్తు రచనలను అందించిన రంగనాథుని కృతులు మాత్రం అతితక్కువగా తెలుగు వారికి అందడం సాహితీ ప్రపంచానికి తీరని లోటుగానే చెప్పాలి.