సూర్యాపేట, (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట కొత్త స్టాండ్ వద్ద మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఫోటోకు పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ... భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బందూకు చేతబట్టి బందగితో కలిసి నడిచి సాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేశారు. తన భూమిని కాపాడుకోవడం కోసం ఎర్రజెండా చేతబట్టి విసునూరు దొరను ఎదిరించి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ ఆయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మని అన్నారు. అలాంటి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మంగళవారం ఎర్ర జెండా బట్టి ఎవరైతే ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతారో వారి నిజమైన వారసులని అన్నారు.
ఐలమ్మ పోరాటం, త్యాగం, వీరత్వం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రని సృష్టించిందని, అలాంటి వీరనారిని ఒక కులం కోసం మతం కోసం వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకోవడం సరైనది కాదన్నారు. ఐలమ్మ అంటే పోరాటం అని తాను కుల మతాలు లేని సమాజం కోరుకున్న విప్లవ వీరనారని కమ్యూనిస్టు యోధురాలని తెలిపారు. ఆమె వారసులమని చెప్పుకునే వాళ్ళు తమ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని వారసత్వంగా మలుచుకొని ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, గొడ్డలి నరసన్న, మోహన్, బాలస్వామి పిడిఎస్యు నాయకులు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.