calender_icon.png 20 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రధాత చాకలి ఐలమ్మ

09-04-2025 06:52:50 PM

రుక్మాపూర్ లో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. 

చేగుంట (విజయక్రాంతి): తెలంగాణ చరిత్రలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) చరిత్రలో నిలిచిపోయారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. చేగుంట మండలంలోని రుక్మాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన నేడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ, వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందన్నారు. ఐలమ్మ వ్యవసాయం సాగుచేస్తుంటే ఓర్వలేక జమీందారులు ఆమెపై దాడి చేయగా, ఎదురోడ్డి పోరాటం చేసిందన్నారు.

ఐలమ్మ ‘ఆంధ్ర మహాసభ' నాయకత్వంలో ఎర్రజెండా పట్టి పోరాడింది. 'గుత్పల సంఘం' సభ్యులు, గ్రామ స్థుల సహకారంతో పంటను తరలించుకు పోవడానికి వచ్చిన గూండాలను తరిమి కొట్టింది. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది అయింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి. ఉద్యమనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చొరవతో వేసిన సబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కు 'చాకలి ఐలమ్మ' పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకొందన్నారు. అంతేకాదు చిట్యాల ఐలమ్మను 'తెలంగాణ తల్లి'గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.