- జయంతి, వర్థంతి ఉత్సవాలకు 15 లక్షలు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఈ నెల 26వ తేదీన అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై శుక్రవారం మంత్రి పొన్నం సమీక్షించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రజక సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాల కోసం బీసీ సంక్షేమ శాఖ రూ.15 లక్షల కేటాయించిందన్నారు. అందులో ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమానికి రూ.12 లక్షలు, వర్ధంతి కార్యక్రమానికి రూ.3 లక్షలు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఉత్సవాల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చైర్మన్‌గా 40 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
పాలకుర్తిలో ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి అనువైన స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి సూచించారు. రవీంద్రభారతిలో అధికారికంగా జరిగే చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరపడంతోపాటు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆమె చేసిన త్యాగం తెలిసేలా అన్ని గ్రామాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు.