calender_icon.png 12 March, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చకచకా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు

12-03-2025 12:35:50 AM

  1. రూ.716 కోట్ల రివైజ్డ్ బడ్జెట్‌తో 160 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
  2. 65 శాతం మేర పనులు పూర్తి 
  3. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్న వేళ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. కాజీపేటలో కేంద్రం హామీ ఇచ్చినట్లుగా కోచ్ ఫ్యాక్టరీ పనులు చకచకా జరుగుతున్నాయని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.

ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారుచేసే సామర్థ్యమున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. గతంలో రూ.521.36 కోట్లతో చేపట్టిన కోచ్ ఫ్యాక్టరీ రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం కోచ్ ఫ్యాక్టరీ పనులు దాదాపు 65శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు.

ఇందులో మెయిన్ షాప్ 68శాతం, పెయింట్ షాప్ 57శాతం, స్టోర్ వార్డ్ 92శాతం, పిట్ ట్రావర్సర్స్ 57శాతం, టెస్ట్ షాప్ 45శాతం నిర్మాణాలను పూర్తి చేసుకున్నాయని.. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 160 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కోచ్ ఫ్యాక్టరీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి... అక్కడ చురుగ్గా పనులు జరుగుతున్నాయని...

అవసరమైతే ఆ పనులు చూసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వందేభారత్ రైలు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అప్‌డేట్స్ విడుదల చేశారు.

ప్రసాద్ పథకంలోకి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం

రాష్ట్ర ప్రజలకు కేంద్రం శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రసాద్(పిలిగ్రిమ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువాలిటీ అగ్‌మెంటేషన్ డ్రైవ్) స్కీమ్ కు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎంపికైంది. ఈ దేవాలయ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ‘ఎక్స్’ వేదికగా వివరాలు తెలిపారు. ప్రసాద్ పథకం ద్వారా రూ.4.21 కోట్లతో ఒకేసారి 200 మందికి పైగా భోజన వసతి కల్పించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబం ధించిన భవనం డిజైన్‌ను సైతం కేంద్రమంత్రి విడుదల చేశా రు.

దీనిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి కేంద్రం ఆమోదించినం దుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి షెకావత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.