30-03-2025 12:00:00 AM
అరుణ కిరణాలతో అవనిలో పొద్దు పొడిచింది
అఖిల జనావళి నిదుర నుండి కళ్ళు తెరిచింది
శుచిగా మంగళ స్నానాలాచరించింది
గృహాలు తోరణాల పట్టు వస్త్రాలతో కొలువు తీరింది
అంబర సంబరాలతో నూతన ఉగాది వచ్చింది
పసందుగాహృది గది చేరింది
గత స్థానం క్రోధి తిరిగి వెళ్ళింది
మరల విశ్వావసు తెరమీదికొచ్చింది
చెట్లు చేమలు చిగురులతో విరిసింది
కోకిలమ్మల కూతలతో ధరణి పల్లవించింది
నింగి నేలను ముద్దాడుతున్నది
ధరాతలం దరహాసాలొలుక బోస్తున్నది
ప్రకృతి పండగపరువముతో కడు మక్కింది
షడ్రుచులను ప్రియంగా త్రాగించింది
ఆరోగ్యానికి ఔషదమని పేర్కొన్నది
విశ్వావసు ప్రేమ పంచుతున్నది
విప్రులను వేదికలపై ఎక్కించింది
పంచాంగశ్రవణం మొదలు పెట్టించింది
ఆదాయ వ్యయాలకు , క్రుంగ కంటున్నది
రాజపూజ్యాలకు పొంగిపో వలదంటుంన్నది
పంచభక్ష పరమాన్నాలతో కడుపు నింపింది
ఆయాసంతో శరీరం మునకలేస్తున్నది
యుగాది హిందువుల సనాతన ప్రతిబింబమైనది
భారతీయ సంస్కృతికి శిఖరమై నిలిచినది
-నమిలకొండ నాగేశ్వర్ రావు, 8688553470
ఉగాది వెలుగు!
వేపవృక్షం పూత పరదా కప్పుకొంది
మామిడి పిందె సరదా చెప్పుకొంది
గండు కోయిల పాట వరదై పారింది
శిశిరం సెలవంటూ ఆకులు రాల్చింది
వాసంతం పచ్చని వెన్నెలై పూసింది
సూర్యుడి చూపుల్లో క్రోధం గిచ్చింది
ప్రకృతి రంగస్థలంపై కొత్తతెర విచ్చింది
విశ్వావసు వత్సరం అదిగో వచ్చింది
తెలుగు లోగిళ్ళకు ఉగాది తెచ్చింది
మనసులు నిండుగా ఉప్పొంగించింది
తళతళల రంగు ముగ్గులు పరిచింది
కళకళల పచ్చ తోరణాలు గుచ్చింది
వెండిగిన్నెలో ఆరు రుచులు కలిపింది
నాలుక వేదికపై నాట్యాలు ఆడించింది
పసుపు రాసి కొత్త పంచాంగం విప్పింది
రాశి కందాయ ఫలాల గుట్టు చెప్పింది
పవిత్రంగా పట్టువస్త్రాలు కట్టబెట్టింది
అక్షతల్లో కలిపి ఆశీర్వచనాలు చల్లింది
శోభాయమానంగా ఓ వెలుగు వెలిగింది
భీమవరపు పురుషోత్తమ్, రాజమండ్రి, 9949800253