calender_icon.png 24 December, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 గంటలు దాటినా కుర్చీలు ఖాళీ

07-11-2024 12:12:19 AM

  1. బల్దియా అధికారులపై మేయర్ ఆగ్రహం 
  2. ఆలస్యంగా వచ్చే వారిపై నివేదిక ఇవ్వాలని అడ్మిన్‌కు ఆదేశాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): బల్దియా అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిపిన ఆకస్మిక తనిఖీలలో పలు సెక్షన్లలో సిబ్బంది వచ్చినప్పటికీ అధికారులు రాకపోవడం, అధికారు లు ఉన్నప్పటికీ సిబ్బంది లేకపోవడం గుర్తించి అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)పై సీరియస్ అయ్యారు.

ఉదయం 11 గంటలు అయినా సీసీపీ సహా ఇతర అధికారులు రాకపోవడంపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. అన్ని సెక్షన్ల అటెండెన్స్ నివేదికను తయారు చేసి తక్షణమే అందజేయాలని ఆదేశించారు. గతంలో రెండుసార్లు కార్యాలయంలోని పలు సెక్షన్లలో మేయర్ ఆకస్మిక విజిట్ చేసి హెచ్చరించినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్ని సెక్షన్లలో కుర్చీలు ఖాళీగా కనిపించడంతో ఇంకా ఆఫీస్‌కు రాలేదా అంటూ మిగతా సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో వారు టిఫిన్ చేయడానికి బయటకు వెళ్లినట్టుగా చెప్పారు. హెల్త్ సెక్షన్‌లో కొందరు సెల్‌ఫోన్‌లో లీనం కావడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో ఉన్న శేరిలింగంపల్లి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆఫీస్‌కు వచ్చి కలవాలని ఆదేశించారు. 

ఆలస్యంగా వస్తే సీఎల్ కట్ చేయాలని ఆదేశం

అనంతరం మేయర్ తన ఛాంబర్‌లో ఆయా విభాగాల ప్రధాన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మూడుసార్లకు మించి ఆలస్యంగా వస్తే ఒక సీఎల్ కట్ చేయాలని, సీఎల్ లేకుంటే ఈఎల్ కట్ చేయాలని అడిషనల్ కమిషనర్ (అడ్మిన్) నళిని పద్మావతిని ఆదేశించారు. ఆలస్యంగా వచ్చేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తక్షణమే నివేదిక అందజేయాల న్నారు.

జీహెచ్‌ఎంసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కచ్చితంగా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అనుమతితో ఎంత మంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకం చేశారు..

మొత్తం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారనే వివరాలు పంపించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీష్, గీత రాధిక, చంద్రకాంత్ రెడ్డి, సత్యనారాయణ, పంకజ, సామ్రాట్ అశోక్, అలివేలు మంగతాయారు, వెటర్నరీ చీఫ్ అబ్దుల్ వకీల్, యూబీడీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.