calender_icon.png 31 March, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ జన్మంటూ ఉంటే ఆదివాసీగా పుట్టాలి

28-03-2025 03:13:36 PM

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య 

ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలవాలని సూచన 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మళ్లీ జన్మంటూ ఉంటే సాంస్కృతి, సాంప్రదాయాలకు విలువను ఇచ్చే ఆదివాసిగా పుట్టాలని ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య(SC , ST Commission Chairman Bakki Venkataiah) అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ,ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ,అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల,ఏఎస్పి చిత్తరంజన్ ,డిఎఫ్ఓ నీరజ్ కుమార్ తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ ప్రాంతంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించి గరీబోళ్ల కన్నీళ్లు తుడిచేందుకు సేవా దృక్పథంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

ఎస్సీ, ఎస్టీలకు హక్కు ప్రకారం వారికి చెం దాల్చిన పథకాలు అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీలున్న నివాస ప్రాంతాల అభివృద్ధికి సబ్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీలు లేక పోవడం తో పల్లెల్లో జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆదివాసి గిరిజనుల భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసైన్డ్ భూములలోని ఎస్సీ ,ఎస్టీలకు పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకారం అందిస్తామన్నారు. అట్రాసిటీ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ను వీలు అయినంత వరకు ఇవ్వకూడదని ఏస్పీ కి సూచించారు.

ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ ని దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పోడు భూముల పట్టాలు అర్హులైన వారికి అందించాలన్నారు. పోడు భూముల్లో కాస్తు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో కొంతమంది మధ్యవర్తులు జోక్యం చేసుకోకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం పై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి నెల 30న మండల స్థాయిలో మీటింగ్ కు తహసిల్దార్ ,ఎస్సై తోపాటు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. యాక్షన్ ప్లాన్ తయారుచేసి తమకు నివేదిక అందించాలని సూచించారు. ఎస్సీ ,ఎస్టీలకు కల్పిస్తున్న రాయితీలు, పథకాలు ,హక్కులపై గ్రామస్థాయిలో వివరించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అలసత్వం వహించిన అధికారులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. శాఖల వారీగా ఎస్సీ, ఎస్టీల కు అందుతున్న ఫలాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో లోకేశ్వరరావు, డి.ఎస్.పి రామానుజం, డిఆర్డిఓ దత్తారావు,గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డిపిఓ బిక్షపతి, సిపిఓ కోటయ్య,ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.