05-04-2025 01:51:00 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 4 ( విజయ క్రాంతి ): తెలంగాణ షెడ్యూల్ కులముల సేవా సహకార సంస్థ, చైర్మన్ శ్రీ నాగరి గారి ప్రీతం యాదాద్రి భువనగిరి జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకం క్రింద వచ్చిన దరఖాస్తుల వివరాలను.
తనిఖీ చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్డిఓ, ఎంపీడీవో, తహసిల్దార్ ఎంపీఓ లతో సమావేశమై రాజీవ్ యువ వికాసం పథకానికి వస్తున్న దరఖాస్తులపై అడిగి తెలుసుకున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి జాప్యం లేకుండా జారీ చేయవలసినదిగా ఆర్డీవో ను కోరుతూ జిల్లాలోని తహసిల్దార్ లకు కూడా ఆదేశాలు జారీ చేయవలసినదిగా కోరారు.
రాజీవ్ యువ వికాసo పథకమునకు రేషన్ కార్డు లేని వారు మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రము సమర్పించవలనని, రేషన్ కార్డు ఉన్నవారు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. లక్షా, రెండు లక్షల యూనిట్లకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చినాయని, ఆ యూనిట్లకు సబ్సిడీ అధికంగాయున్నందున అట్టి యూనిట్లకు దరఖాస్తు చేయవలసినదిగా యువతను కోరినారు.
అదేవిధంగా రూ.50,000/-ల పథకానికి బ్యాంకు సంబంధం లేకుండా చిన్న తరహా యూనిట్లకు దరఖాస్తులు చేసుకోవలసినదిగా కోరారు. అనంతరం హన్మాపూర్ గ్రామ కోళ్ల ఫారముల సముదాయములోని లబ్ధిదారుల కుటుంబాలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో , ఆర్.డి.వో కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్,ఎం.పీ.డీ.వో శ్రీనివాసులు, తాసిల్దార్ అంజిరెడ్డి, ఎం.పీ.ఓ దినకర్, ఏ.ఈ.ఓ బాల్ సింగ్, సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.