calender_icon.png 27 December, 2024 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రిబ్యునల్ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు

08-11-2024 01:22:28 AM

  1. పార్టీ ఫిరాయింపుల కేసులో బీఆర్‌ఎస్ వాదనలు
  2. విచారణ నేటికి వాయిదా 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరడం లేదని, స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా విచారిస్తారు కాబట్టి ట్రిబ్యునల్ చైర్మన్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్‌రావు గురు వారం హైకోర్టులో వాదించారు. పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.

ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్‌కు రాజ్యాంగ ధర్మాసనాలైన సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, ఉత్తర్వులు, తీర్పులు ఇవ్వొచ్చునని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విధులు నిర్వహించే స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వొచ్చని, గతంలో సింగిల్‌జడ్జి వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గండ్ర ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయడం చెల్లదని చెప్పారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సింది స్పీకరేనని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌పై కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరు తూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా.. స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ౪ వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు దాఖలు చేసిన రెండు అప్పీల్ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది.