- విదేశీ పర్యటనలో నగర మేయర్
- తనకు ఇంచార్జి బాధ్యలు అప్పగించాలని డిప్యూటీ మేయర్ కలెక్టర్‌కు ఫిర్యాదు
కరీంనగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై పంచాయితీ నెలకొన్నది. కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి 23న అమెరికాకు వెళ్లారు. రెండు వారాలపాటు స్థానికంగా అందుబాటులో ఉండలేనని, మొబైల్ ద్వారా, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మేయర్ రిటర్న్ టికెట్ 33 రోజుల తర్వాత ఉండడంతో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణికి చార్జ్ ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ఈ మేరకు పలువుర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి అవకాశం ఇవ్వాలని కమిషనర్‌ను విన్నవించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ బీఆర్‌ఎస్‌కు చెందినవారే కావడం గమనార్హం. మరోవైపు మేయర్ చార్జి ఇవ్వకపోవడంపై డిప్యూటీ మేయర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం సెక్షన్ 34(2), 1993లో మున్సిపల్ యాక్ట్ ప్రకారం.. మేయర్ 15 రోజులు అందుబాటులో లేకపోతే డిప్యూటీ మేయర్‌కు ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించాలని చట్టం తెలుపుతుందని డిప్యూటీ మేయర్ స్వరూపారాణి కలెక్టర్ దృష్టిలో పెట్టారు.
మేయర్ సొంత పనులపై విదేశాలకు వెళ్లారని, తనకు ఇంచార్జి బాధ్యతలు అప్పగింలేదన్నారు. ఇదిలా ఉండగా ఈ పంచాయితీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. మేయర్‌కు అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ ఆయన తమకు చార్జి ఇవ్వకుండా, అమెరికా వెళ్లడంపై డిప్యూటీ మేయర్ స్వరూపారాణి వాపోయినట్లు తెలిసింది. ఆదివారం కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి మేయర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మరో నాలుగు నెలల్లో పదవీకాలం ముగియనున్న తరుణంలో పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది. తనపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో మేయర్ సునీల్‌రావు తన పర్యటనను ముగించుకుని 12 రోజులకే అమెరికా నుండి తిరిగి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.