calender_icon.png 21 November, 2024 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పులు కట్టేందుకు చైన్‌స్నాచింగ్

21-11-2024 12:53:19 AM

కాలేజీలో దివ్యాంగుడిపై దాడి చేసి గొలుసు అపహరణ

నిందితుడిని పట్టుకున్న జనగామ పోలీసులు

జనగామ, నవంబర్ 20 (విజయక్రాంతి): ఓ వైపు ఉద్యోగం దొరక్క.. మరోవైపు బెట్టింగులకు అలవాటుపడి చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాను చదువుకున్న కాలేజీలోనే లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న దివ్యాంగుడిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించాడు. చివరికి పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు. బుధవారం జనగామ ఏసీపీ పార్థసారథి వివరాలు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా గ్రామపంచాయతీ పరిధిలోని బక్కరుప్పుల తండాకు చెందిన కేలోతు సాయికృష్ణ(23) 2020 నుంచి 2023 వరకు జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. ఆర్థిక సమస్యల వల్ల అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి తన సోదరి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.

డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఏదైనా ఉద్యోగం చేద్దామని మళ్లీ తాను చదువుకున్న జనగామకు వెళ్లాడు. ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం వెతకగా ఎక్కడా దొరకలేదు. దీంతో డఫాబెట్ అనే ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగులకు అలవాటుపడి డబ్బులు పోగొట్టు కున్నాడు. ఇందుకోసం కొందరి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడం, మరోవైపు కట్టాల్సిన ఈఎంఐలు పెండింగ్‌లో ఉండటంతో సాయికృష్ణ దృష్టి చోరీల వైపు మళ్లింది.

ఈ నెల 4న పీజీ అడ్మిషన్ కోసం ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లాడు. అక్కడ లైబ్రేరియన్ దివ్యాంగుడని గమనించాడు. లైబ్రరీలో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. జనగామ పట్టణంలోని బాలాజీనగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో ఉన్నట్లు గుర్తించి బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద తులం బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై భరత్, సిబ్బందిని సీపీ అభినందించారు.