కలెక్టర్ అనుదీప్
శిశువిహార్‌లో ప్రత్యేక క్యాంపు సందర్శన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): చిల్డ్రన్ కేర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్జీవో, శిశువిహార్)లోని పిల్లలకు వారం రోజుల్లో ధ్రువపత్రాలను జారీచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మధురానగర్ శిశువిహార్ సంరక్షణ కేంద్రంలో చిల్డ్రన్ కేర్ ఇనిస్టిట్యూషన్స్‌లోని పిల్లలకు కులం, ఆదాయం, జనన ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్‌ను ఆయన సందర్శించారు.
శిశుసంరక్షణ కేంద్రంలోని 8నెలల బాలికకు జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఎన్జీవో సంస్థలు, శిశువిహార్‌లలోని పిల్లలందరికీ వారంరోజుల్లోగా సర్టిఫికెట్లను అందజేయాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయా కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు.
సంరక్షణ కేంద్రంలోని పిల్లల తల్లిదండ్రులు చనిపోతే వారి ఆస్తులు పిల్లలకు అందేలా రెవెన్యూ శాఖకు వివరాలు అందజేయాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీసీపీవో శ్రీనివాస్, ఎమ్మార్వో నయీముద్దీన్, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ సుమలత తదితరులు పాల్గొన్నారు.
యాదయ్య సేవలు అభినందనీయం
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పేదపిల్లల అభ్యున్నతికి మెరుగైన సేవలందించిన ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా డీడీ పెరిక యాదయ్య సేవలు అభినందనీయమని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన యాదయ్య పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్, ముకుందరెడ్డి, డీఆర్వో వెంకటాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ ప్రజావాణిలో పాల్గొని.. ప్రజలనుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు.