calender_icon.png 19 September, 2024 | 7:31 AM

మధుమేహ కట్టడికి సిరిధాన్యాలు

19-07-2024 12:00:00 AM

సిరిధాన్యాలను (మిలెట్స్) ప్రధాన ఆహారంగా తీసుకుంటున్న ప్రజల్లో టైప్-2 మధుమేహ సమస్యలు తగ్గుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ వ్యాధి లేని వారి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు వస్తున్నదని, ముందు జాగ్రత్తలతో దీనిని పూర్తిగా నిరోధించవచ్చని వారు తెలిపారు. ఈ మేరకు ‘ఫ్రాంటీయర్స్ ఇన్ న్యూట్రీషన్’ పత్రికలో ఒక వ్యాసం ప్రచురితమైంది. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఎన్‌ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్), ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి-అరిడ్ ట్రోపిక్స్)లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలనూ పత్రిక ప్రచురించింది.

ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో జరిపిన పరిశోధనల్లో మిలెట్స్‌ను ప్రధాన ఆహారంగా వాడడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ 12-- శాతం తగ్గుతూ, డయాబెటిస్ సమస్య లేకుండా పోతున్నదని తేలింది. సిరిధాన్యాలు తీసుకునే వారిలో ‘గ్లైసెమిక్ ఇండెక్స్’ (జిఐ) నియంత్రణవుతూ, హిమోగ్లోబిన్‌ను అంటు కొని ఉండే ‘బ్లడ్ గ్లూకోస్’ (హెచ్‌బీఏ1సి) స్థాయి 17 శాతం వరకు పడిపోయి షుగర్ సమస్య దూరమవుతున్నట్లు పరిశోధకులు వివరించారు. సిరిధాన్యాలను ‘స్మార్ట్ ఫుడ్’ జాబితాలో చేర్చాలని కూడా వారు సలహా ఇచ్చారు. గతంలో పలు ప్రాంతాల్లో మిలెట్స్‌సహా జొన్నలను కూడా తీసుకునే అలవాటు ఉండేది. బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల ప్రాధాన్యం పెరిగిన తరువాత సిరిధాన్యాల వాడకం పూర్తిగా తగ్గిపోయింది.

 భారత్, చైనా, అమెరికా దేశాల్లో మధుమేహ రుగ్మతలు అధికంగా ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా దేశాల్ల్లో మధుమేహ నియంత్రణకు ఏకైక సులభ మార్గమైన సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా వాడకమేనని తెలుస్తున్నది. మధుమేహ అదుపునకు జీవన శైలి మార్పులు, తీసుకునే ఆహార పదార్థాల స్వభావం లాంటివి దోహద పడతాయి. ప్రపంచంలో నేడు 46.3 కోట్ల మధుమేహ రోగులు ఉన్నారని, 2045 నాటికి వీరు 70 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ రోగుల్లో ఒక భారతీయుడు ఉంటారని అంచనా.

ఒకవైపు పోషకాహార లోపం, మరోవైపు స్థూలకాయం లాంటి సమస్యలు జీవనశైలి రుగ్మతలకు కారణం అవుతున్నాయి. పోషకాహార లోపం, ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ప్రకృతి వనరుల విచ్ఛిన్నం, వాతావరణ మార్పులకు సమాధానంగా సిరిధాన్యాల వాడకం చక్కగా ఉపయోగపడు తుందని అభిప్రాయ పడుతున్నారు. అందుకే, ఆరోగ్యదాయక ఆహారంగా సిరిధాన్యాలను గుర్తించి, బియ్యం, గోధుమలు, మక్కల వాడకాన్ని తగ్గించాలని వారు కోరుతున్నారు. ఈ రకంగా మధుమేహం రహిత మానవ సమాజాన్ని నిర్మించుకుందాం. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి