27-04-2025 10:32:35 AM
పహల్గామ్: ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అధికారికంగా చేపట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంశాఖ ఆదేశంతో ఎన్ఐఏ కేసు విచారణ స్వీకరించింది. ఉగ్రదాడి ఘటనాస్థలంలో ఆధారలులు సేకరిస్తోంది. ఎన్ఐఏ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి చూసిన సాక్షులను ఎన్ఐఏ బృందం ప్రశ్నించనుంది. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పహల్గామ్‌లో(Pahalgam) జరిగిన దాడి తర్వాత భారత సైన్యం(Indian Army) తీవ్ర అప్రమత్తతతో ఉంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అనేక శోధన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.
పహల్గామ్(Pahalgam Terror Attack Probe) దాడిపై పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు చెలరేగాయి. ఇటీవలి దాడిపై చర్య తీసుకుంటూ భారత ప్రభుత్వం 1960 సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ దారుణ దాడిపై ప్రతీకారం తీర్చుకోవడంతో అట్టారి చెక్‌పోస్ట్‌ను మూసివేసింది. అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజు వేర్వేరు సెక్టార్లలో కాల్పులు చోటుచేసుకున్నాయి. నీలం వ్యాలీ, లీఫా వ్యాలీలో రాత్రంతా కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.