08-04-2025 05:17:50 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి జీరో టాలరెన్స్ పాలసీతో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో ఉగ్రవాద కార్యకలాపాలకు చోటు లేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల సంఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతించామన్నారు. మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు మరణశిక్ష సరైన శిక్ష అని, హైకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
12 సంవత్సరాలుగా ఒక పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగిందని మేము విశ్వసిస్తున్నామన్నారు. బాధితుల కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ తరపున తామ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మోడీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీతో పనిచేస్తోందని, గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో ఇటువంటి సంఘటనలకు అవకాశం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించకూడదని, అన్ని రాజకీయ పార్టీలు దీనిని గుర్తుంచుకోవాలన్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులను శిక్షించడంలో ఎన్ఐఏ(NIA) కీలక పాత్ర పోషించిందని, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.