28-03-2025 01:31:49 AM
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల అమలుపై ఆరా
జగిత్యాల, మార్చి 27 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిధిలో కేంద్ర ఆరోగ్య సేవా కార్యక్రమాల అమలు, నిర్వహణ తీరును సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, వైద్య బృందం, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య సేవల అమలు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగం గూర్చి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, సేవల అమలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసి, ఆరోగ్య సేవలు అందుస్తున్న విధానాన్ని వారితో ముఖా ముఖితెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక వసతులు, లాబ్ సేవలు, గర్భిణిలకు, ప్రసవానంతరం తల్లులకు అందించే సేవలు, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు, యుక్త వయసు వారికి ఆరోగ్యం, ఫ్యూబార్టి సమ యంలో వచ్చే మార్పులపై కౌన్సిలింగ్ చేయ డం, అసంక్రమిక వ్యాధులకు, సంక్రమిక వ్యాధులకు అందించే సేవలను, మందుల నిలువలు, నిధుల వినియోగం గురించి క్షున్నంగా సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఆరోగ్య సేవలపట్ల సంతృప్తి వ్యక్త పరిచారు. అనంతరం ఐసిటిసి సెంటర్, టీబీ యూనిట్లను సందర్శించి ఆన్ హ్యాండ్ క్షయ వ్యాధిగ్రస్తుల కేసులు ఎన్ని ఉన్నాయి, వారందరికీ చికిత్స అందించే కారడ్స్ ఉన్నాయా సరి చూశారు.
నిక్షయ పోషణ యోజన కింద వారందరికీ డబ్బులు అందు తున్నాయా అడిగి తెలుసుకున్నారు. ప్రతీ నెలా ప్రిజంటివ్ టెస్టింగ్ ఎక్కువగా జరిగేలా చూడాలని, తద్వారా ఏ ఒక టీబీ కేసు తప్పి పోకుండా తగిన చికిత్స అందించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ లక్ష్మి, ఈఎన్టి డాక్టర్ రమేష్, జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి తులసి రవీందర్, హెచ్‌ఈ తరాల శంకర్, సూపర్వైజర్ బి.మురళీధర్, ఫార్మసిస్ట్ ఉదయ్ ప్రసాద్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.