14-03-2025 09:07:44 PM
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ వెంకటేశ్వరరావు
ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎన్కౌంటర్ పేరుతో మధ్య భారతంలో ఆదివాసులపై జరుగుతున్న కాల్పులను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రైతు కూలీ సంఘం నాయకులు, ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ వెంకటేశ్వరరావు(Adivasi Rights Struggle Solidarity Platform Convener Venkateswara Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ విద్యానగర్ మర్క్స్ భవన్ లో శుక్రవారం ఆదివాసి హక్కుల పరిరక్షణకై పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, సి ఎల్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు అధ్యక్షతన ఉమ్మడి హైదరాబాద్ ఆదివాసుల పరిరక్షణ సంఘీభావ వేదిక ను ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరుల దోపిడిని వెంటనే అరికట్టి పర్యావరణాన్ని పరి రక్షించాలన్నారు. అదే విధంగా పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసుల పరిరక్షణ సంఘీభావ వేదిక కమిటీని ఎన్నుకున్నారు. సంఘీభావ వేదిక కన్వీనర్లుగా ఇందిరా, రాణి, జయక్క, రవి, సురేష్ కుమార్, మహేష్ బాబు, అదే విధంగా కమిటీ కో-ఆర్డినేటర్ గా పౌరహక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ తో పాటు వేదిక కమిటీ ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.