01-04-2025 01:02:41 AM
రూ.7 పెంచిన కేంద్రం
నేటినుంచి అమల్లోకి..
రూ.307 చేరిన దినసరి కూలి
మెదక్, మార్చి 31 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభు త్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికిచ్చే కూలీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ సమయంలో పనులకు వచ్చే కూలీలకు ప్రయోజనం చేకూర్చేలా గతంలో కేంద్రం అదనపు భత్యం చెల్లించేది. అయితే రెండేళ్ళుగా దీనిని నిలిపివేసింది. తాజాగా ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో దినసరి కూలీ మరో రూ.7లకు పెంచింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1.64 లక్షల మంది కూలీలకు లబ్ది చేకూరనుంది.
రూ.307కు చేరిన కూలి
వలసలను అరికట్టి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు స్థానికంగానే వంద రోజుల పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్కార్డు కలిగిన వారికి చెరువులు, కుంటలు, బావు ల్లో పూడికతీత, హరితహారం కింద నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షించడం, వ్యవసాయ భూముల సంరక్షణ వంటి పనులను కల్పిస్తున్నారు. పథకం ప్రా రంభంలో రోజువారీ కూలీ రూ.87.50 గా చెల్లించేవారు. నిత్యవాసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో కూలీలకు లబ్ది చేకూర్చేలా కూలి సైతం క్రమంగా పెంచుతూ వస్తోంది. 2022లో రూ.12 పెంచగా, 2023లో రూ .15 పెంచారు. గతేడాది అత్యధికంగా రూ. 28లు పెంచడంతో రోజువారీ కూలి రూ.300లకు చేరింది. తాజాగా మరో రూ.7 పెంచడంతో ఇది రూ.3007కు చేరువైంది. ప్రస్తుతం సగటు కూలి రూ.238.77గా చెల్లిస్తున్నారు.
పెరగనున్న కూలీల సంఖ్య...
మెదక్ జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలంతా ఉపాధి పనులపైనే ఆసక్తి చూపుతారు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా పథకం అమలు చేయనుండడంతో కూలీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న రెండు నెలల పాటు ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. ప్రతీ కూలీకి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికను సిద్దం చేసిన అధికారులు తదనుగుణంగా బడ్జెట్ కేటాయించారు. ఈ పనులకు హాజరయ్యే కూలీలకు అవసరమైన పార, గడ్డపార, తట్టల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గతం లో అదనపు భత్యం చెల్లించేది. అయితే మూడేళ్ళుగా దాన్ని నిలిపివేసింది. బదులుగా కూలి పెంచుతూ వస్తోంది..
నేటినుంచి అమలు.. శ్రీనివాసరావు, డీఆర్డీవో, మెదక్
కేంద్ర ప్రభుత్వం పెంచిన దినసరి కూలి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో కూలీలకు ఆర్థికంగా కొంత లబ్ది చేకూరనుంది. జాబ్కార్డు కలిగిన ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
జిల్లాలో ఇలా...
కుటుంబాలు : 3,31,555
యాక్టివ్ జాబ్ కార్డులు : 1,64,368
పూర్తి చేసిన పనిదినాలు : 40.89 లక్షలు
పనిచేసిన కూలీలు : 1,53,793 మంది
వంద రోజులు పని పూర్తి చేసిన
కుటుంబాలు : 2,446