పూర్తిగా భారతీయులు ప్రారంభించి, నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో బొంబే (ప్రస్తుతం ముంబై)లో ప్రారంభమయ్యింది. బ్రిటిషర్ల ఆధిపత్యంలో ఉన్న భారతీయ బ్యాంకింగ్ రంగంలో పూర్తిగా స్వదేశీయుల నిర్వహణలో బ్యాంక్‌కు స్థాపించాలన్న ధ్యేయంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అప్పటికే బ్యాంకర్‌గా అనుభవం ఉన్న సొరాబ్జీ పోక్నావాలా స్థాపించారు.
తొలి చైర్మన్‌గా బారిష్టర్ విద్యనభ్యసించిన ఫిరోజ్‌షా మెహతా వ్యవహరించారు. ఇప్పుడది ఆస్తుల రీత్యా టాప్‌న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎనిమిదవ పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది. పలు వినూత్న బ్యాంకింగ్ సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఘనత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నది.
1924లోనే మహిళా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా బ్యాంక్‌లో లేడీస్ డిపార్ట్‌మెంట్‌ను నెలకొల్పింది. 1926లో సేఫ్ డిపాజిట్ లాకర్ సదుపాయాన్ని, రూపీ ట్రావెలర్స్ చెక్కులను ప్రవేశెట్టింది. 1932లో డిపాజిట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ స్కీమ్‌ను, 1962లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆవిష్కరించింది.
1969లో 13 ఇతర బ్యాంక్‌లతో పాటు జాతీయం చేసిన తర్వాత కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కొత్త సేవల్ని ప్రవేశపెట్టింది. దేశంలో క్రెడిట్ కార్డులను జారీచేసిన తొలి బ్యాంక్‌ల్లో ఇది ఒకటి.
వందేండ్ల క్రితమే హైదరాబాద్‌లో శాఖ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శతాబ్దకాలం క్రితమే 1918లో హైదరాబాద్‌లో శాఖను ఏర్పాటుచేసింది. అటుతర్వాత 1925లో సికింద్రాబాద్ సమీపంలో మరో శాఖను ప్రారంభించింది. సెంట్రల్ ఎక్సేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో లండన్‌లో 1936లో తొలి భారతీయ ఎక్సేంజ్ బ్యాంక్‌ను నెలకొల్పిన ఘనత సెంట్రల్ బ్యాంక్ ఇఫ్ ఇండియాదే.
4,500 శాఖలు.. రూ.4.47 లక్షల కోట్ల ఆస్తులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 8,473 శాఖలు ఉన్నాయి.2024 జూన్‌నాటికి 31,238 మంది ఉద్యోగులు ఉన్నారు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.4.47 లక్షల కోట్లు. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 93.08 శాతం వాటా ఉన్నది. ఈ బ్యాంక్‌కు ప్రస్తుతం తపన్ రే నాన్ చైర్మన్‌గా, తెలుగు వ్యక్తి మటం వెంకటరావు ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
రూ.50 వేల కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50,453 కోట్లు. గడిచిన మూడేండ్లలో ఈ షేరు 166 శాతం పెరిగింది.