28-04-2025 01:48:37 AM
పగడాల యాదయ్య సీపీఎం జిల్లా కార్యదర్శి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 27: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. ఆదివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలోనీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందు ఉగ్రవాదుల చేతుల్లో బలైన ప్రజలకు నివాళులర్పించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పగడాల యాదయ్య పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మర్చి కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఉగ్రదాడులను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దేశంలో ఇంత పెద్ద ఇంటలిజెన్స్ వ్యవస్థ సైనిక బలగాలను ఉంచుకొని కూడా ఉగ్రవాద చర్యలను పసిగట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై కమ్యూనిస్టు శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి డి. కిషన్, మున్సిపల్ కమిటీ సభ్యులు ఎం.సత్యనారాయణ, జే.ఆశీర్వాదం, కే.అరుణ్ కుమార్, కే.వెంకట కృష్ణ, ఐ.భాస్కర్, బి.మాల్యాద్రి, బి.శంకరయ్య, ఐ.కృష్ణ పాల్గొన్నారు