రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల
ఆధునీకరణకు సాయం
త్వరలో చర్లపల్లి
రైల్వే టెర్మినల్ ప్రారంభం
కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
కాప్రా, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్నీవిధాల సహాయమందిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ నిధులు కేటాయిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, దక్షణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తదితరులతో కలిసి ఆదివారం ఆయన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడు తూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని, కేంద్రంలో ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రధాని మోదీ చేసిన వర్ణనాతీతమన్నారు. వందేభారత్ రైళ్లను ఢిల్లీ తర్వాత అత్యధికంగా తెలంగాణకే కేటాయించారని, త్వరలో వందేభారత్ రైలులో స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు బీజీపీ ప్రభుత్వం నిధులు కేటాయి స్తుందని చెప్పారు.
తెలంగాణలో రైల్వే టెర్మినళ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ అభివృద్ధికి రూ.715 కోట్లు, నాంపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధికి రూ.429 కోట్లు, చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధికి రూ.430 కోట్లు కేటాయించా మన్నారు. తెలంగాణలో 369 కిలోమీటర్లలో 346 కొత్త రైల్వే లైన్ల పనులు ప్రారం భించినట్లు వెల్లడించారు.
యాద్రాది వరకు ఎంఎంటీఎస్ రైల్వే లైన్‌ను పొడగించడంతో పాటు కొమరవెల్లి మల్లన్న వరకు రైల్వే లైన్ పనులు చేపట్టారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 174 రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
దేశాభివృద్ధికి ప్రధాని కృషి: ఈటల
ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నిజాం కాలంలో నిర్మించిన రైల్వే స్టేషన్లను ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలో ప్రారంభించనునట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం భరతీశ్ కుమార్ జైన్, చీఫ్ అడ్మిస్టేషన్ అధికారి సత్యప్రకాశ్, మాజీ శాసన సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టెర్మినల్
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగా ణ ప్రభుత్వ సహకారంతో చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లే రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దా మన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్‌లను కలుపుకొని టెర్మినల్‌కు వచ్చే రహదారుల నిర్మాణ పను లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అత్యాధునిక ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్‌పోర్ట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించామని చెప్పారు. టెర్మినల్ చుట్టూ గ్రీనరీని పెంపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.