calender_icon.png 14 November, 2024 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోచింగ్ సెంటర్లకు కేంద్రం వార్నింగ్

14-11-2024 12:43:38 AM

తప్పుడు ప్రకటనలు చేస్తే భారీ జరిమానా

రాతపూర్వక అనుమతితోనే ఫొటోలు, పేర్లు వాడుకోవాలి

కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, నవంబర్ 13: స్వప్రయోజనాల కోసం పలు పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేస్తుంటాయి. ఇలా తప్పుడు ప్రకటనలు చేసే కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించింది. అంతేకాకుండా 100శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోచింగ్ సెంటర్లు అవి అందించే కోర్సులు, వాటి వ్యవధికి సంబంధించిన తప్పుడు ప్రకటనలు చేయకూడదు. అలాగే ఎవరైనా ఉద్యోగాలకు ఎంపికైతే వారి రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వారి ఫొటోలను, పేర్లను ప్రకటనల్లో ఉపయోగించాలి. కోర్సుల గురించిన ముఖ్యమైన సమాచారమంతటినీ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. కొందరు యూపీఎస్సీ అభ్యర్థులు సొంతంగానే ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు.

కేవలం ఇంటర్వ్యూల కోసం మాత్రమే కోచింగ్ తీసుకుంటారు. అలాంటప్పుడు అభ్యర్థులు తమ వద్దే పూర్తి కోచింగ్ తీసుకున్నట్టు కోచింగ్ సెంటర్లు ప్రకటించకూడదు. ఎంపికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సుకు సంబంధించి శిక్షణ తీసుకున్నారో బహిర్గం చేయాలి. చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అలాగే అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రతను కల్పించాల్సి ఉంటుంది.

కాగా, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సుల విషయంలో కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నంచి కొంత సమాచారాన్ని దాస్తుండటం తాము గమనించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో అనేక ఫిర్యాదులో వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ వివరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది.