- వివాదంలో ఐసీ 814 వెబ్‌సిరీస్
- హైజాకర్లకు హిందువుల పేర్లు ఎందుకు వాడారని ప్రశ్న
- వివరణ ఇవ్వాలంటూ సంస్థ చీఫ్ మోనికాకు ఆదేశాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నెట్‌ఫ్లిక్స్ ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ ఓటీటీలో విడుదలైన ఐసీ 814 ది కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజల సెంటిమెంట్లతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదంటూ స్పష్టం చేసింది. భారత సంస్కృతి, నాగరికతను ఎల్లప్పుడూ గౌరవించాల్సిందేనని, ఏదైనా తప్పుడు పద్ధతిలో చిత్రీకరించే ముందు ఆలోచించాలని సూచించింది.
ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా చీఫ్ మోనికా షెర్గిల్‌కు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. వెబ్‌సిరీస్‌లో హైజాకర్ల పేర్లను ఎందు కు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ కశ్మీర్ ఫైల్స్‌పై అభ్యంతరం తెలిపినా నోటీసులు ఇవ్వ ని కేంద్రం ఈ వెబ్‌సిరీస్‌పై ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తోందని విమర్శించారు.
హిందువుల పేర్లు వాడటంపై
1999లో జరిగిన కాందహార్ హైజాక్ ఇతివృత్తంగా, ఫ్లుటై ఇన్ టూ ఫియర్ పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను చిత్రీకరించారు. కాగా హైజాక్ తర్వాత హైజాకర్ల పేర్లను 2000 జనవరి 6న ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్, సన్నీ అహ్మద్, మిస్త్రీ జహూల్ ఇబ్రహీం, షకీర్ అని తెలిపింది. కానీ వెబ్‌సిరీస్‌లో మాత్రం చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా, శంకర్ అనే పేర్లను ఉపయోగించారు. దీంతో హైజాకర్లకు హిందువుల పేర్లను పెట్టడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కాగా, హైజాక్ సమయంలో హైజాకర్లు ఒకరినొకరు పలకరించుకునేందుకు ఇవే పేర్లను ఉపయోగించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.