calender_icon.png 28 October, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై కేంద్రం కక్ష

24-07-2024 01:00:18 AM

మోదీ పెద్దన్నలాగ వ్యవహరించలేదు 

ఆయనను మూడుసార్లు కలిసి అభ్యర్థించాం

కేంద్రమంత్రులతో 18 సార్లు భేటీ అయ్యాం 

పద్దు ప్రసంగంలో తెలంగాణ పదాన్ని నిషేధించారు 

కిషన్‌రెడ్డి, బండి ఏం చేస్తున్నారు? 

మోదీకి బానిసల్లా కాదు.. తెలంగాణ వారీగా ఆలోచించాలి: సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షచూపడమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన వాటికి నిధులు  కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రధాని మోదీని తానే స్వయంగా మూడుసార్లు కలిసి తెలంగాణకు రావాల్సిన హక్కులను అడిగామని సీఎం తెలిపారు.“కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని నిషేధించారు.

తెలంగాణ పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటంలేదు. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీ మరోసారి తనకున్న కక్షను చాటారు” అని సీఎం ధ్వజమెత్తారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తెలంగాణ వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మెరుగుపరుద్దామని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయింపులు చేయాలో అన్ని రకాలుగా కేటాయించారని, ఆ రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇస్తున్నారని తాము అడగటం లేదన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏపీకి నిధులు కేటాయించారని, అదే చట్టంలోని తెలంగాణ విషయంలో వివక్ష ఎందుకుని రేవంత్‌రెడ్డి నిలదీశారు. గుజరాత్ తరహాలోనే హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ఫ్రంట్‌కు నిధులు కేటాయించమని మోదీని అడిగామని, 5 మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందని,  ఈ నగరానికి నిధులు ఇస్తే దేశ ఎకానమీకి ఉపయోగపడుతుందని చెప్పామని సీఎం పేర్కొన్నారు. గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఐటీఐఆర్ కారిడార్ మరుగున పడిందని సీఎం విమర్శించారు. 

ఇది ఏపీ, బీహార్ బడ్జెట్ 

సబ్‌కాసాత్.. సబ్‌కా వికాస్ బోగస్ అని బీజేపీ నిరూపించిందని, వికసిత్ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం లేదా? అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌ను చూస్తే ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకునే విధంగా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు ఎక్కువ నిధులు కేటాయించారని, మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదన్నారు. ఇంత పక్షపాత బడ్జెట్‌ను గతంలో ఎన్నడు చూడలేదని మండి పడ్డారు. ఇది బాబు, నితీశ్‌కుమార్‌పై ఆధారపడిన ప్రభుత్వమన్నారు.  తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని తాను ఎన్నికల ముందే చెప్పినట్లు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమే పెట్టినట్లుగా ఉందని, కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని  సీఎం దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏపీతో పాటు తెలంగాణకు ఇవ్వాల్సిన అంశాలున్నాయని సీఎం గుర్తు చేశారు. ఏపీలో పోలవరం, అమరావతి నిర్మాణంతో పాటు వెనుకబడి జిల్లాలకు నిధులు కేటాయించారని,  తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గిరిజన యూనివర్సిటీని పట్టించుకోలేదన్నారు. మెట్రో, మూసీ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మరో ఉద్యమం తప్పదని సీఎం హెచ్చరించారు. 

కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి 

రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ మోదీకి బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచించి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నా నిధులు తీసుకురావడంలో ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి  ప్రత్యేక నిధులు, విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో విఫలమైన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉందని, తెలంగాణకు కూడా ఇవ్వమని మోదీకి లేఖ ఇచ్చామని, ఇది కుదరదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మూడు రోజుల క్రితం సమాధానం ఇచ్చారని సీఎం తెలిపారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీల చేతగాని తనం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. 

బడ్జెట్ సవరించి నిధులు కేటాయించాలి 

కేంద్ర బడ్జెట్‌ను సవరించే అవకాశం ఉందని, సవరించిన బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పూడ్చాలని రేవంత్‌రెడ్డి కోరారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫార్మా విలేజ్ నిర్మాణంతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి  పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలో చర్చించి న్యాయం చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం వెల్లడించారు. 

అసెంబ్లీలో చర్చ.. పార్లమెంట్‌లో నిరసన 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో చర్చ పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కోరుతున్నట్లు సీఎం తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రభుత్వంతో కలిసివచ్చేది ఎవరో? చీకటి ఒప్పందాలు చేసుకున్నది ఎవరో? సభలో తేలిపోతుందన్నారు. కేసీఆర్ సభకు వస్తే తెలంగాణ ప్రజల కోసం నిలబడుతున్నట్లుగా ఉంటుందని, సభకు రాకుంటే కిషన్‌రెడ్డితో కలిసి ఉన్నట్లుగా ఆర్థం చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ఎంఐఎంతో పాటు రాజ్యసభలో ఇతర పార్టీలు కూడా కలిసి రావాలని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. 

దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తమను ఓటు వేసే యంత్రాలుగానే కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకున్నా తెలంగాణ అభివృద్ధిపై తమకు ప్రణాళికలున్నా యని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.