calender_icon.png 8 February, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీలపై కేంద్రం పట్టు!

28-01-2025 12:00:00 AM

వర్సిటీల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇటీవల విడుదల చేసిన ముసాయిదా కేంద్రం, రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర తీసేలా కనిపిస్తోంది. అధ్యాపపకుల నియామకాలపై 2018లో జారీ చేసిన కనీస ప్రమాణాలు, అర్హతలను యూజీసీ రద్దు చేస్తూ నూతన నిబంధనల పేరిట ఒక ముసాయిదాను వెలువరించింది.

దీనిపై సలహాలు, సూచనలను కూడా యూజీసీ ఆహ్వానిస్తోంది. అయితే ఈ ముసాయిదాలోని అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన వైస్ ఛాన్సలర్ల నియామకం అధికారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది.

కొత్త ముసాయిదా ప్రకారం  ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇదే వివాదానికి కారణమవుతోంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉన్నతవిద్యను కాషాయీకరణ చేయడానికి కేంద్రం యత్నిస్తోందని ఆ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణ కూడా ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ఈ నిబంధనలపై మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీ(యూ), తెలుగుదేశం, లోక్‌జనశక్తి పార్టీలు కూడా దీనిపై అసంతృప్తితో ఉన్నాయి.

కేంద్రం చర్యలతో ఉన్నత విద్యపై తమ పట్టును పూర్తిగా కోల్పోవలసి వస్తుందన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల భయం. ఇప్పటికే అనేక విషయాల్లో కేంద్రం రాష్ట్ర సంబంధాలు బలహీనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి జాబితాలోని విద్యపై కూడా కేంద్రం పట్టు సాధించాలనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఆ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి.

ఇప్పటికే ఒకేసారి రెండు డిగ్రీలు, ఆన్‌లైన్ పాఠాలు అంటూ యూజీసీ కొత్త ప్రతిపాదనలతో మోతెక్కిస్తోంది.మరోవైపు ప్రతిరాష్ట్రం ఉన్నతవిద్యపై ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. భూమి కేటాయింపు మొదలుకొని భవనాల నిర్మాణం, అధ్యాపకులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులన్నీ రాష్ట్రాలే భరిస్తున్నాయి. ఎలాంటి నిధులూ ఖర్చు చేయని కేంద్రం రాష్ట్రాలపై స్వారీ చేయాలని చూడడాన్ని విద్యావేత్తలు సైతం హర్షించడం లేదు.

నూతన నిబంధనలు అమల్లోకి వస్తే వర్సిటీల విషయంలో రాష్ట్రప్రభుత్వాలది కేవలం ప్రేక్షక పాత్ర అవుతుంది. ఎందుకంటే ఉపకులపతుల ఎంపికకు సెర్చ్ కమిటీ ఏర్పాటునుంచి నియామకం పూర్తయ్యేవరకు గవర్నర్లకే అధికారం ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్‌తో  ప్రభుత్వాల వివాదం కారణంగా వైస్‌చాన్సలర్ల నియామకం ప్రక్రియ స్తంభించి పోయింది.

మిగతా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకవిధంగా నెట్టుకువస్తున్నాయి. వీటన్నిటి మూలంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రాజ్యాంగపరంగా చూసినా కొత్త నిబంధనలను రాష్ట్రాలపై రుద్దే అవకాశం కేంద్రానికి లేదు. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ తర్వాత విద్య ఉమ్మడి జాబితాలోకి వచ్చింది.

విద్య విషయంలో సమన్వయం, ప్రమాణాల స్థిరీకరణ వరకే కేంద్రం అధికారం పరిమితం. అంతకుమించి మొత్తం పరిపాలనను తన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. అయితే కొత్త ముసాయిదా ఉన్నత విద్యలో పారదర్శకతను తీసుకువస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగానే ఈ మార్పులు తీసుకు రావాలనుకొంటున్నట్లు కేంద్రం అంటోంది.

కానీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముసాయిదాపై పునరాలోచన చేయడం మంచిది. లేక పోతే ‘నీట్’ లాగానే ఇదికూడా ఓ వివాదంగా మారే ప్రమాదం ఉంది.