మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై కొత్త రూల్స్
నెలలోపే నిబంధనలు ప్రకటించే అవకాశం
కంపెనీలకు భారీ జరిమానాలు
ప్రమోట్ చేసే సెలబ్రిటీలపైనా నిషేధం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: మద్యం ప్రకటనల విషయంలో కఠిన చట్టాలను తీసుకురావాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ప్రత్యక్షంగా ప్రకటనలు ఇవ్వడంపై నిషేధం ఉంది. ఇప్పుడు సరోగేట్, స్పాన్సర్ యాడ్లపైననా విస్తృతమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఈ నెలలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యంతో పాటు పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు, ప్రముఖులు వాటిని ప్రోత్సహించే విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకోనున్న ట్లు తెలిసింది. ఇలాంటి ప్రకటలను ఇచ్చే కంపెనీలపై భారీగా జరిమానా విధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
నెలలోపే కొత్త నిబంధనలు
దేశంలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం ఉండటంతో ఆయా కంపెనీలు మరో దారిలో తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటున్నారు. ఉదాహరణకు కార్ల్స్‌బర్గ్, పెర్నోడ్ రికార్డ్, డియాజియో వంటి సంస్థలు తమ మద్యం ఉత్పత్తుల పేర్లను ప్రజలల్లోకి తీసుకెళ్లేందుకు అదే లోగోతో నీరు, సోడా, ఇతర పానీయాలను తయారు చేసి వాటి యాడ్లలో ప్రముఖులను ప్రచారం చేస్తారు.
ఇప్పుడు వీటిపైనా నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖలోకి కీలక అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద మద్యం వినియోగదారుగా ఉంది. కొత్త రూల్స్ వస్తే మద్యం తయారీదారులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో కింగ్‌ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్, హెయిన్‌కెన్ గ్రూప్ అగ్రగామిగా ఉన్నాయి. కొత్త రూల్స్ వస్తే ప్రముఖ బ్రాండ్ల విస్తరణను ప్రచారం చేసుకోలేకపోతాయి. వీటిని ఉల్లంఘిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా విధించేవచ్చని సదరు అధికారి చెప్పారు.