calender_icon.png 9 March, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం వివక్ష

09-03-2025 12:45:23 AM

  1. తెలంగాణ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు 
  2. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయాలి..
  3. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 
  4. ప్రజాభవన్‌లో అఖిలపక్ష సమావేశం 
  5. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు గైర్హాజరు 
  6. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, అనేక ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అనుమతులు నిలిచి పోయాయని ఆయన వాపోయారు.

రాష్ట్రప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గత నెల 10న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశం లో ఆయన మాట్లాడారు.

సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు గైర్హాజరు కాగా, పలువురు కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. సమావేశంలో ఎంపీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపుతున్న అసమానతలు, వివక్ష వంటి 28 అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మా ట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. విభజన హామీలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఆర్‌ఆర్‌ఆర్, టెక్స్‌స్టుల్ పార్క్, నవోదయ స్కూల్స్ వంటి అనే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపించామని, కానీ..

కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని అఖిల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు గైర్హాజరు కావడంపై ఆయన స్పందిస్తూ..

తాము ముందస్తు సమాచారం ఇవ్వని కారణంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశానికి హాజరు కాలేకపోయామని చెప్తున్నారని, వారి కోరి క మేరకు ఈసారి వారం రోజుల ముందే సమాచారం ఇస్తామని, అవసరమైతే ప్రతిఒక్కరినీ వ్యక్తిగతంగా పిలిచి అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై తాము కేంద్రానికి ఇచ్చిన లేఖలను బుక్‌లెట్‌గా తయారు చేశామని, వాటిని తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలందరికీ అందిస్తామన్నారు.

అలాగే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో అఖిల పక్ష ఎంపీల సమావేశం ఏర్పాటు చేస్తామని, సమావేశంలో పెండింగ్ సమస్యలను వివరిస్తామ న్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: ఎంపీ అసదుద్దీన్ 

రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, వారంతా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు, ఎన్ని ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చారని ఎంఐఎం అధినేత, ఎంపీ అస దుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో 2 ఫేజ్ వంటి ప్రాజెక్టులు కేంద్రం ఆమో దం కోసం ఇప్పటికీ వేచి ఉన్నాయని వెల్లడించారు.

అలాగే గోదావరి ఫేజ్‌ఆ తాగు నీటి సరఫరా కూ కేంద్రం నిధులు మంజూ రు చేయాల్సి ఉందన్నారు.  తెలంగాణతో పోలిస్తే విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలైన కేరళ, అస్సాం, మేఘాలయ, పంజాబ్, జార్ఖండ్‌లో ఎక్కువ మం ది ఐపీఎస్ అధికారులు సేవలు అందిస్తున్నారని, కానీ.. రాష్ట్రంలో మాత్రం తక్కువ మంది ఐపీఎస్‌లు సేవలు అందిస్తున్నారని వాపోయారు. రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు పెంచాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినా, ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. 

చివరి నిమిషంలో పిలుస్తారా ?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

అత్యంత కీలకమైన సమావేశాలు, అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం ఉన్న భేటీలకు చివరి నిమిషంలో పిలిస్తే.. ఎలా హాజరు కాగలమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు లేఖ రాశారు. శనివారం జరగనున్న అఖిల సమావేశానికి బీజేపీ ఎంపీలకు ముందు రోజు రాత్రి ఆహ్వానం అందించడమేంటని ప్రశ్నించారు.

తాము హాజరు కావాల్సిన కార్యక్రమాలు ముందుగానే నిర్ణయించి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీలు వారి పార్లమెంటరీ సెగ్మెంట్లలో అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు,  వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.