calender_icon.png 8 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌తో దక్షిణాదిపై కేంద్రం కుట్ర

08-04-2025 01:37:07 AM

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకేం చేశారు?

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

టీజేఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 7 (విజయక్రాంతి):  డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై కుట్ర పన్నుతున్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో సోమవారం టీజేఎస్ ఆధ్వర్యంలో ‘పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణ భారత భవిష్యత్’ అనే అంశంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలన్నీ పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మతం పేరుతో రెచ్చగొట్టి బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా, మరో ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచారని, వారు రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 11 ఏళ్ల మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కుల మతాలు పేరిట చిచ్చుపెట్టేవారిని ప్రజలు ఉపేక్షించకూడదన్నారు. వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమావళవన్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాదిలో  సీట్లు తగ్గుతాయని వివరించారు.

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులిస్తూ వస్తున్న కేంద్రం, డీలిమిటేషన్ జరిగితే ఇక దక్షిణాదిని ఏమాత్రం పట్టించుకోదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగంతో పాటు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సమావేశంలో తమిళనాడు విల్లుపురం ఎంపీ రవికుమార్, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సీనియర్ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, సీపీఐ కార్యదర్శి పశ్య పద్మ, సీపీఎం రాష్ట్ర కారదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీడీఎస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత  గోవర్థన్‌రావు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నేత అన్వేశ్, దళిత, బహుజన ఫ్రంట్ నేత కొరివి వినయ్‌కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.