calender_icon.png 1 November, 2024 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్లి రాజకీయం!

29-04-2024 12:05:00 AM

ఎన్నికల వేళ ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తివేత

పరిమిత స్థాయిలో ఎక్స్‌పోర్ట్‌కు అనుమతి

ఊపిరి పీల్చుకున్న మహారాష్ట్ర రైతులు

ఈ నిర్ణయం బీజేపీకి అనుకూలిస్తుందంటున్న నేతలు

లక్ష టన్నులతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్న వ్యాపారులు

నాసిక్ (మహారాష్ట్ర), ఏప్రిల్ 28: ఉల్లి.. ప్రభుత్వాలను మార్చిన చరిత్ర దీనికి ఉంది. గతంలో ఎమర్జెన్సీ విధించి ఓడిపోయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. ఉల్లిధరల పెరుగుదలను వాడుకునే జనతా ప్రభుత్వం నుంచి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచున్నారు. అందుకే ప్రభుత్వాలు, పార్టీలు ఉల్లిధరలపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఉల్లిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో సరిపడా నిల్వలు ఉండేలా 5 నెలల క్రితమే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఉల్లి ధరలు అదుపులోనే ఉన్నాయి. కానీ, తాజాగా ఈ నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్ర రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఊపిరి పీల్చుకున్న రైతులు.. 

దేశంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటుంది. నాసిక్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా పండుతుంది. అయితే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో ఇక్కడి రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. విపక్షాలు కూడా దీనిపై దృష్టి పెట్టడంతో బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 5 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేయడంతో ఉల్లి రైతులు ముఖ్యంగా మహారాష్ట్రలో సాగు చేసేవారు ఊపిరి పీల్చుకున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యూఏఈ దేశాలకు దాదాపు లక్ష టన్నుల వరకు ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్, కొన్ని ఐరోపా దేశాలకు మరో 2 వేల టన్నుల తెల్ల ఉల్లిపాయలను ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఎత్తివేత 5 నెలల పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. 2023 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట దిగుబడి తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ పెరిగిన కారణంగా గతేడాది డిసెంబర్ 8న ఉల్లి ఎక్స్‌పోర్ట్‌పై నిషేధం విధిస్తుందన్నట్లు కేంద్రం ప్రకటించింది. 

బీజేపీకి ప్రయోజనం..!

ఉల్లి ఎగుమతలపై నిషేధం ఎత్తివేతపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రధాని నరేంద్రమోదీకి శనివారం కృతజ్ఞతలు తెలిపారు. నిషేధం ఎత్తివేతతో బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు దాడి చేసే అవకాశం కోల్పోయారని, రైతుల సమస్యలపై వారికి ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదని విమర్శించారు. కేంద్రమంత్రి, దిండోరి బీజేపీ అభ్యర్థి భారతి పవార్ మాట్లాడుతూ.. ఈ ప్రకటనతో ఉల్లి రైతులు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. దిండోరిలో ఉల్లి ఎగుమతుల నిషేధం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. ఇది రైతులకు ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. దిండోరి నియోజకవర్గంలో ఉల్లి రైతులు గణనీయంగా ఉన్న నేపథ్యంలో వారి ఓట్లు కీలకం కానున్నాయి. కేంద్రం ప్రకటనపై నాసిక్ బీజేపీ కార్యకర్తలు సైతం హర్షం వ్యక్తం చేశారు. నిషేధం వల్ల రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎన్‌పీ (శరద్ పవార్ వర్గం) అభ్యర్థి భాస్కర్ భాగారేకు ప్రయోజనం కలిగించింది. తాజా నిర్ణయంతో నియోజకవర్గంలో బీజేపీకి పరిస్థితులు మెరుగుపడతాయి. ఉల్లి రైతులను ఆకర్షించేందుకు ఈ ప్రకటన మాకు సహాయపడుతుంది అని ఓ బీజేపీ నేత అన్నారు. 

వ్యాపారుల్లో మాత్రం ఇప్పటికీ అసంతృప్తి

కాగా, నిషేధం ఎత్తివేసినప్పటికీ ఉల్లి వ్యాపారుల్లో ఒక వర్గం మాత్రం అసంతృప్తితో ఉంది. ప్రతినెలా 48 వేల టన్నుల ఉల్లి నాసిక్ నుంచి ఎగుమతి అవుతుంది. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ వంటి ఇతర జిల్లాల నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతి జరుగుతుంది. అయితే కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ చాలా తక్కువ మొత్తంలో లక్ష టన్నులకే అనుమతి ఇచ్చింది. ఇంత తక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. టోకు ధరలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది అని స్థానిక వ్యాపారి ఒకరు తెలిపారు.