- వైరస్ కట్టడికి కీలక నిర్ణయాలు
- అనుమానితులకు టెస్టులు చేయాలని నిర్దేశం
- దవాఖానల్లో ఐసోలేషన్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత్‌లో మంకీ పాక్స్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు జారీ చేసింది. వ్యాధి అనుమానితులకు పక్కాగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే కాంటాక్ట్ లిస్ట్‌ను రెడీ చేయాలని పేర్కొన్నది. జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖ సమీక్షలు నిర్వమించాలని ఆదేశించింది. సర్కార్ దవాఖానల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ సౌకర్యాలు కల్పించాలని, చికిత్సపై వైద్యులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. జనవరి 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాలకు మంకీ పాక్స్ వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష వరకు కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికన్ దేశాల్లోనే మంకీ పాక్స్ కారణంగా ఇప్పటికే 600 మంది మృత్యువాత పడ్డారు. మరో 15,000 మంది ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ తాజాగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా ఖండంలోని ఓ దేశం నుంచి భారత్‌కు వచ్చిన యువకుడికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని, ఆ వ్యక్తి ప్రస్తుతం ఐసోలోషన్ విభాగంలో ఉన్నాడని తెలిసింది. వ్యాధికి సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.