- ఆకలి తీర్చిన మహా దేవాలయానికి వందేళ్లు
- అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు
కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
మెదక్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కరువుతో కొట్టుమిట్టాడిన ప్రాంతాన్ని మెతుకు సీమగా మార్చి ఆకలి తీర్చిన మహా దేవాలయం మెదక్ చర్చి. పనికి ఆహార పథకం కింద ఆకలితో అలమటించిన అన్నార్థులకు కడుపునింపిన పవిత్ర కట్టడం.. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరొందిన ఈ మహాదేవాలయం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వందేళ్ల సంబురాలపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా క్రిస్మస్ పండగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పకడ్బం దీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తర లిరానున్నారు. మెదక్ ప్రాంతంలో వందేండ్ల కింద 1914లో తీవ్రమైన కరువు తాండవించింది.
తినడానికి తిండిలేక ప్రజలు అలమటి స్తున్న ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశానికి చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ క్రైస్తవ గురువుగా ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ ప్రాంత దుస్థితిని చూసి చలించిన ఆయన ఏసుక్రీస్తు మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చర్చి నిర్మాణానికి 120 ఎకరాల భూమిని ఉచితంగా అందించారు.
పనికి ఆహారంతో నిర్మితమై..
చార్లెస్ వాకర్ అనుకున్నదే తడువుగా చర్చి నిర్మాణానికి అంకురార్పణ చేయడమే కాకుండా పనికి ఆహార పథకం కింద ఈ ప్రాంత పేదల కడుపులు నింపారు. 1914లో చర్చి నిర్మాణం ప్రారంభమైంది. పదేళ్ల పాటు కొనసాగిన పనులు 1924లో పూర్తయ్యాయి. చర్చి నమూనాను ఐరోపా గోథిక్ శైలిలో ఆంగ్ల ఇంజినీర్ బ్రాడ్‌షా రూపొందించగా, వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహ రించారు.
ఇటలీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు భాగస్వాములయ్యారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రెండంతస్తుల్లో నిర్మించిన చర్చికి 175 అడుగుల ఎత్తున గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చర్చిలో ఒకేసారి ఐదు వేల మంది ప్రార్థనలు చేయొచ్చు. చర్చి లోపల ప్రతిధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పును వేశారు.
వేడుకలకు రానున్న సీఎం, ఉపరాష్ట్రపతి
ఈనెల 25న శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ పర్వదినాన్ని ఘ నం గా నిర్వహించేందుకు డయాసిస్ పెద్ద లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక ల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకాను న్నారు. అదేరోజు ఉపరాష్ట్రపతి సైతం చర్చిని సం దర్శించనున్నారు. సీఎం రాక సందర్భంగా స్థానిక డ యాసిస్ పెద్దలతో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏర్పాట్లను పర్య వేక్షిస్తున్నారు.
1947లో డయాసిస్ కేంద్రంగా..
చర్చి నిర్మాణం చేపట్టాక మొదట్లో ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 1947లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ)గా రూపాంతరం చెందాక డయాసిస్ కేంద్రంగా మారింది. ఆ తర్వాత బిషప్‌ను నియమించడంతో కేథడ్రల్ అ యింది. దీని పరిధిలోకి ఉమ్మడి మెదక్‌తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వస్తాయి. చర్చి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ఆసుపత్రులు, విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు కొనసాగుతున్నాయి.