16-03-2025 01:33:39 AM
ముషీరాబాద్, మార్చి 15: కేంద్ర ప్రభు త్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కులాల జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. శనివారం కాచిగూడలో ఓబీసీ డెమోక్రెటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన ‘ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికా రమే అంతిమ లక్ష్యం’ అనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి 80 కుల సంఘాలు, 36 బీసీ సంఘాలు, 42 ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలను వెలివేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
రాజకీయంగా తనను బడుగు బలహీన వర్గాలే ఎదగకుండా దెబ్బతీశాయని, బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు ముందుకు సాగాలని మాజీ ఎంపీ వీ హనుమంతారావు అన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలని విశ్రాంత ఐఏఎన్ అధికారి చిరంజీవులు అన్నారు.
కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంఘాల నాయకులు నాయకులు నీల వెంకటేశ్ ముదిరాజ్, అనంతయ్య, వేముల రాచుకృష్ణ, రాజీండర్, సుధాకర్, సుందర్ రాజు యాదవ్, మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, రామారావు గౌడ్, ఉడయ్ నేత, బాలయ్య పాల్గొన్నారు.