పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న కులగణన సర్వేకు గ్రేటర్‌వ్యాప్తంగా 21 వేల మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకోనున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ తెలిపారు.
సర్వేపై సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్ కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో దానకిశోర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర వివరా లతో నూటికి నూరు శాతం సర్వే సమగ్రంగా ఉండాలని సూచించారు.
ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా వివరా లు నమోదు చేయాలని తెలిపారు. సర్వే చేపట్టే ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించామని అన్నా రు. ఎన్యూమరేటర్లకు సందేహాలు ఉంటే సంబంధిత సూపర్‌వైజర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని చిట్టచివరి పేదలకు కూడా ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి ఈ సమగ్ర సర్వే దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లు కే శివకుమార్ నాయుడు, స్నేహ శబరీష్, చంద్రకాంత్‌రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.