calender_icon.png 28 September, 2024 | 10:53 AM

కులగణన జరిగి తీరుతుంది

27-09-2024 12:38:04 AM

బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్‌కు లేదు

చాకలి ఐలమ్మ జయంతిసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ 

గతప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకుంది: మంత్రి జూపల్లి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, కుల గణన జరిగి తీరుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం రవీంద్ర భార తీలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు.

ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొని ఐలమ్మ ఫొటో కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంత రం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కోఠిలోని మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరును పెట్టారని గుర్తుచేశారు. ఆమె మనువరాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశమిచ్చారన్నారు. అధికారంలో ఉన్నపుడు ఆమె త్యాగాన్ని గుర్తించనివారు ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు.

భూమి కోసం భుక్తి కోసం నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కుమ్రంభీం తదితరులు మన హక్కుల కోసం పోరాడారని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో బలహీనవర్గాల ఫెడరేషన్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవ కాశాలు మెరుగుపరిచేలా కార్యాచరణను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

ఐలమ్మ అందరికీ స్ఫూర్తి.. 

తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఐలమ్మ అందరికీ స్ఫూర్తి అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆమె కోసం ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనన్నా రు. తమ చావులతోనైనా తెలంగాణ రావాలని ఎందరో బలిదానాలు చేశారని గుర్తు చేసుకున్నారు. వందలాది మందిబిడ్డలు త్యాగాలు చేస్తే శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు గత పాలన జరిగిందని విమర్శిం చారు. రూ.వేల కోట్లు లూటీ అయ్యాయని ఆరోపించారు.

ప్రజల మెప్పు కోసమే గతపాలకులు అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు ప్రొ.కోదండరాం, బస్వరాజు సారయ్య, బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, బీసీ కమిషన్ కమిటీ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, ఐలమ్మ మనువ రాలు శ్వేత, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.