calender_icon.png 29 October, 2024 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి మోడల్‌గా కులగణన

29-10-2024 01:55:39 AM

  1. సర్వేపై అందరి అభిప్రాయంతో ముందుకెళ్తాం
  2. సామాజికవేత్తలు, మేధావుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదారాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి ప్రారంభమయ్యే కులగణన దేశవ్యాప్తంగా ఒక మోడల్‌గా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో పాటు కులసంఘాలు, యువజన సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లతో ప్రత్యేకంగా సమావేశమై కుల గణనపై అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు.

సోమవారం సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై వారితో సమాలోచనలు చేశారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుందన్న అడిగారు.

రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయవాదులతో పాటు కులసంఘాలు, యువజన సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. కులగణనకు సంబంధించిన ప్రణాళిక, అధికారులకు దిశానిర్ధేశం చేయడానికి మంగళవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రణాళిక శాఖ రూపొందించిన ప్రశ్నాపత్రం సమగ్రంగా ఉందని సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు అభినందించినట్లు భట్టి గుర్తు చేశారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టంలో కులగణన చేస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బహిరంగసభలో ప్రకటించామని, అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

పాత కమిషన్ కాలం ముగిసిన వారంలోపే కొత్త బీసీ కమిషన్ వేసినట్లు గుర్తు చేశారు. కులగణనపై ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 56 ఇండ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం.. ఒక ఎన్యుమరేటర్ 15 ఇండ్లు సర్వే చేయాల్సి ఉంటుందని, అలా చేస్తే వారిపై భారం పడుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.

సర్వే చేసే ఇళ్ల సంఖ్యను పదికి కుదించాలని మురళి అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

జిల్లా అధికారులకు శిక్షణ..

కులగణనపై హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఆర్‌డీలో జిల్లా ప్లానింగ్ శాఖ అధికాలకు శిక్షణ ఇచ్చారు. క్లాజులను ఎలా నింపాలి? వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనుమానాలను ఎలా నివృత్తి చేసుకోవాలన్న అంశాలపై రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఇదిలాఉండగా.. కులగణన చేసే 75 క్లాజులతో కూడిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.

అయితే వాటిలో ఉన్న కొన్ని లోపాలను గుర్తించిన అధికారులు మంగళవారం సరిదిద్ది ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు జరిగే కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించున్నట్లు సమాచారం. ఎన్‌హెచ్‌ఆర్‌డీలో శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్స్.. ఆ తర్వాత మండల, గ్రామస్థాయిలోని ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.