calender_icon.png 23 December, 2024 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలబ్రిటీ క్రూరత్వం

06-09-2024 12:00:00 AM

తాము చేసిన నేరాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలుకుబడి కలిగిన పెద్దలు, సెలబ్రిటీలు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారనే దానికి కన్నడ నటుడు దర్శన్ ఉదంతమే ఒక ఉదాహరణ. నటి పవిత్రాగౌడతో తనకున్న సంబంధం విషయంలో అభిమాని రేణుకా స్వామి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడన్నకారణంగా అతనిని దారుణంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేయించాడన్నది దర్శన్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఈ కేసులో బళ్లారి జైల్లో ఉన్న దర్శన్ జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 9తో ముగియనుంది.ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు పోలీసులు దర్శన్‌పై దాదాపు 4 వేల పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

కేసుకు సంబంధించి సేకరించిన దాదాపు 200 ఆధారాల వివరాలను పోలీసులు ఇందులో పొందుపరిచారు. వాటిలో దర్శన్‌తో పాటుగా ఇతర నిందితు లు ధరించిన దుస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ నివేదికలు సైతం ఉన్నా యి. దీంతో కన్నడ సినీ రంగంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన దర్శన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. రేణుకా స్వామి పవిత్రగౌడపై పదేపదే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనే కోపంతో చిత్రదు ర్గనుంచి కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటుగా 10 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు.

చార్జిషీటులో పవిత్ర గౌడను ప్రథమ ముద్దాయిగా, దర్శన్‌ను రెండో ముద్దాయిగా పేర్కొన్నారు. పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తున్న సమయంలోనే  రేణుకాస్వామిని ఎలా చిత్రహింసలకు గురి చేశారని సూచించే ఫొటోలు సోషల్ మీడియాలో లీక య్యాయి.  రేణుకాస్వామి ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న చిత్రంతో పాటుగా  చొక్కా, నీలిరంగు జీన్స్  ధరించి ఓ ట్రక్కు ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్న మరో ఫొటో కూడా వైరల్ అయ్యాయి. దర్శన్ సహాయకుడు, కిడ్నాప్‌లో పాలు పంచుకున్న పవన్ అనే వ్యక్తి ఫోన్‌లో ఉన్న ఈ  ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్వామి తీవ్ర గాయాలవల్ల చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక సైతం వెల్లడించింది. ఎముకలు  విరిగిపోయాయని, అతడి శరీరంపై మొత్తం 39 గాయాలున్నాయని పేర్కొంది. ఈ దారుణమైన దాడిలో రేణుకాస్వామి స్పృహతప్పిపోతే కరెంట్ షాక్ పెట్టి మేల్కొనేలా చేసి మరీ హింసించారు. హత్య చేసిన తర్వాత డబ్బు, తన పరపతి ఉపయోగించి స్వామి మృతదేహాన్ని మాయం చేయడానికి, సాక్ష్యాలు నాశనం చేసేందుకు దర్శన్ యత్నించాడని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అతడి మర్మాంగాలపైనా గాయాలు ఉన్నాయి. గత జూన్ 9న బెంగళూరు సమీపంలోని ఓ మురుగునీటి కాలువలో రేణుకాస్వామి మృతదేహం లభించింది.

 బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను కోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే బళ్లారి జైలుకు మార్చారు. జైలు బ్యారక్‌నుంచి బైటికి వచ్చి స్నేహితులతో కలిసి కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి ఇటీవల బయటికి రావడం, అది తీవ్ర చర్చకు దారితీ యడం తెలిసిందే. దర్శన్‌తో కలిసి కాఫీ తాగుతున్న వారిలో ఓ రౌడీషీటర్ కూడా ఉన్నాడు.దీంతో సీరియస్ అయిన రాష్ట్రప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు అతడిని వేరే జైలుకు తరలించింది. కాగా తామే ఈ హత్య చేశామంటూ మొదట లొంగిపోయిన ముగ్గురికి ఈ హత్యతో ఎలాంటి సం బంధం లేదని గుర్తించిన పోలీసులు వారిని ముందే విడుదల చేయడం గమనార్హం. 

రేణుకా స్వామి మొదట పవిత్రా గౌడ్‌కు అశ్లీల చిత్రాలు పం పించడంతో వివాదం మొదలు కాగా, వాటిని పంపించిన అంశాన్ని ఇన్‌స్టాగ్రామ్  అధికారులు పోలీసులకు ధ్రువీకరించారు కూడా. దర్శన్ చం దన సీమలో  పాపులర్ నటుడు అయినప్పటికీ ఎలాంటి ప్రభావానికి గురి కాకుండా దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అభినందించారు. చార్జిషీటు దాఖలుకు 90నుంచి120 రోజుల గడువు ఉన్నప్పటికీ 88 రోజుల్లోనే  కోర్టుకు చార్జిషీటును సమర్పించినట్లు కూడా ఆయన చెప్పారు. అత్యంత పకడ్బందీగా రూపొందిన ఈ చార్జిషీట్‌తో దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసినట్లయింది.