న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెండు దశల ఓటింగ్ పూర్తయింది. మూడో దశ ఎన్నికలు వచ్చే నెల 7న జరుగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి. నువ్వా..? నేనా? అనే విధంగా తలపడుతున్నాయి. ఈ నేఫథ్యంలో ఏయే స్థానాల నుంచి ఎవరెవరు ఏయే పార్టీలు.. ఏయే కూటమిల నుంచి పోటీ చేస్తున్నారు? వారు ఎక్కడి నుంచి? ఎవరిపై పోటీ చేస్తున్నారో..? ఓ లుక్కెద్దామా..!
జ్యోతిరాదిత్య సింధియా..
ఈయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంస్థానం చిట్టచివరి మహారాజు జీవాజీరావ్ సింధియా మనవడు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గుణ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రావ్ యాదవేంద్ర సింగ్ బరిలో ఉన్నారు.
పల్లవి డెంపో..
ఈమె గోవాలో ప్రముఖ వ్యాపారవేత్త. విద్యావేత్త. అంతేకాదు డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జికుటివ్ డైరెక్టర్. ఈమె ప్రస్తుతం దక్షిణ గోవా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె లోక్‌సభ ఎన్నికల్లో గోవా నుంచి పోటీ చేస్తున్న తొలి మహిళగా కొత్త రికార్డు సృష్టించారు. ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యర్థిగా విరియాటో ఫెర్నాండెస్ బరిలో ఉన్నారు.
కేసీ ఈశ్వరప్ప..
ఈయన మాజీ బీజేపీ నేత. కర్ణాటక మాజీ మంత్రి. ప్రస్తుతం ఈయన శివమొగ్గ లోక్‌సభ నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతోపాటు బరిలో బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర, కాంగ్రెస్ అభ్యర్థి గీత బరిలో ఉన్నారు. గీత ప్రముఖ సినీ స్టార్ శివరాజ్‌కుమార్ సతీమణి.
బసవరాజ్ బొమ్ము..
ఈయన బీజేపీ నేత. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఈయన హవేరీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆనందస్వామి గడ్డదేవర బరిలో ఉన్నారు.
ప్రల్హాద్ జోషి..
ఈయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని ధర్వాడ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాలు, బొగ్గు గనులశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూతి బరిలో ఉన్నారు.