ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా చేపడుతున్నారు. బుధవారం వాఘాపూర్, పిప్పల్ దరి, డోప్టాల, పిప్పర్ వాడ, గ్రామాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ నేత కంది శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వాఘాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంచార్జ్ మంత్రి సీతక్కతో పాటు పలువురు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎడ్ల బండి నడిపి గ్రామస్తులను ఉత్సాహపరిచారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణాలో ప్రజాపాలన నడుస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. చెప్పినట్టుగానే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు.