25-04-2025 12:43:17 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తున్నట్టు కనిపించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పాకిస్థాన్ దేశంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. పాక్ హైకమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లి..‘కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు? కేక్ కట్ చేసే సందర్భం ఏమిటి?’అని ప్రశ్నించారు. దానికి అతడు సమాధానమివ్వకుండా వెళ్లడం కనిపించింది. సదరు వ్యక్తి గోధుమ రంగు పఠానీ సూట్ ధరించి, గడ్డంతో ఉన్నాడు.
కాగా, పాక్ హైకమిషన్ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే పాక్ అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.