- పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్న పార్టీ శ్రేణులు
- పాల్గొన్న దీపాదాస్ మున్షీ, మధుయాష్కీ, మెట్టుసాయికుమార్
- సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా రూ.లక్ష వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తం గా సంబురాలు నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీభవన్‌లోనూ నేతలు సంబురాలు నిర్వహిం చారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు.
కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతు కష్టాలు తెలిసిన కాంగ్రెస్ రుణమాఫీ చేసిందన్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు పూర్తిగా మాఫీ చేస్తుందని తెలిపారు. గాంధీభవన్‌లో మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశచరిత్రలోనే మొదటిసారని, రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతులు అడిగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఏమిచేయాలో ఆర్థం కావడం లేదని.. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో దోపిడీ తప్ప రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు శుభాకాంక్షలు
రైతు రుణమాఫీతో రుణవిముక్తులు కాబోతున్న అన్నదాతలకు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15 వరకు రూ. 2 లక్షల వరకు మాఫీ కాబోతుందని, ఇది రైతు లోకానికి ఎంతో శుభ సూచకమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేత సువేంధు అధికారి చేసిన వ్యాఖ్యలు సరికావని, దేశంలో అందరినీ ఒకే దృష్టితో చూడాలన్నారు.